డోలాయమానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి?

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండే పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది పాపం. తనకు తెలియకుండానే తనకు డిప్యూటీగా ఉపముఖ్యమంత్రి వచ్చి మరొకరు అదనంగా కూర్చున్నారు. తనను ఎవరు ముంచుతారో ఎవరు తేల్చుతారో తెలియని విధంగా ఉన్నది. తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక అనిశ్చితితో కూడిన భయాం దోళనలో ఉన్నారు. ఏకనాథ్‌ షిండే తనకున్న బలం వల్ల ముఖ్యమంత్రి కాలేదు. ఒక పార్టీని చీల్చి వెన్నుపోటుతో బయటికి రాగలిగిన బలహీనత వల్ల ముఖ్యమంత్రి కాగలిగాడు. ఈ బలహీనతను అవకాశంగా మలుచుకుని వందకు పైగా శాసనసభ్యులు ఉన్న బీజేపీ 50లోపు శాసనసభ్యులు గల ఏకనాథ్‌ షిండేను ముఖ్యమంత్రిని చేసి ‘మహా వికాస్‌ ఆగాది’గా చెప్పుకుంటున్న కూటమిని పడగొట్టగలిగింది. ఈ రకంగా చేసి, ‘అయితే మేము పదవిలో ఉండాలి లేదా మా అండదండలతో ప్రభుత్వాలు ఉండాలి’ అన్న అధికార దాహాన్ని తీర్చుకోవడానికి వంతెనగట్టుకుని కూర్చున్నది బీజేపీ. ఈ విధంగా అధికార దాహంతో దశాబ్దాలుగా వేచి చూస్తున్నా అజిత్‌ పవార్‌ నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌పార్టీ అసంతృప్త సీనియర్‌ నాయకుణ్ణి మరోసారి వలవేసి వశపరచుకోగలిగింది. ఇలా ఎన్సీపీని చీల్చడంలో పాపం ఏకనాథ్‌ షిండేకి ఎలాంటి పాత్ర లేదు. కథ నడిపిస్తున్నదంతా బీజేపీకి చెందిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌. కాంగ్రెస్‌ నుండి కూడా ఒక వర్గం చీలి వస్తే మరో ఉప ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు ఉన్నది. స్థిరమైన ప్రభుత్వము కొనసాగాలనే ఉద్దేశంతోనైనా ఇన్నాళ్లు ఏకనాథ్‌ షిండేకు ఆదేశాలు బీజేపీ నుండి వెళ్లి ఉండకపోవచ్చు, ఇప్పుడు ఏ రకమైన ఆదేశాన్ని ఇవ్వడానికైనా బీజేపీకి అధికారం లభించింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే కేవలం ఒక రబ్బరు స్టాంపులా ఉండవలసిందే. లేదంటే ఆయనను మార్చి మరొకరిని ముఖ్య మంత్రి స్థానంలో కూర్చో బెట్టడానికి సర్వం సిద్ధంగా ఉన్నది. షిండేకు సంబంధించిన శివసేన పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజు రోజుకు రాజుకుంటున్నది. ఇది కాస్త పెరిగి పెద్దదైతే దానిని అడ్డం పెట్టుకొని షిండే వర్గాన్ని పూర్తిగా తప్పించి బీజేపీనే ముఖ్యమంత్రి స్థానాన్ని అతి త్వరలో ఆక్రమించే అవకాశమూ లేకపోలేదు. అధికారానికి దగ్గర లేకుండా చాలా కాలం కార్యకర్తలను, నియోజక వర్గాన్ని మైంటైన్‌ చేయడం అంత సులభం కాదని ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగంగా ఒప్పుకుంటారు. అలాంటప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులన్నీ ప్రజాసేవ కోసం మాత్రమే జరిగాయని ప్రజలకు చెబితే అది హాస్యాస్పదమే అవుతుంది. షిండే వర్గాన్ని మహారాష్ట్ర నుండి అస్సాంకు అక్కడి నుండి గుజరాత్‌కు మార్చి ప్రమాణ స్వీకారం చేసే నాటికి వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని జాతీయ మీడియా కుప్పలు తెప్పలుగా ప్రచురించింది. మరి ఇప్పుడు జరిగిన చీలికలోను కోట్ల రూపాయలు చేతులు మారలేదని విశ్వసించలేం. ఏదో ఒక వృత్తిలో నిమగమై అప్పుడప్పుడు వార్తలు చూస్తూ ఎప్పుడూ సెల్‌ ఫోన్లలో అసంబద్ధ సత్యాలను ఫార్వర్డ్‌ చేస్తున్న మధ్యతరగతి ప్రజానీకానికి ఈ రాజకీయాల వెనుక ఉన్న కులం, మతం లేదా పైపై మెరుగుల దేశభక్తి వంటివి కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి అనిశ్చితి కలిగిన రాజకీయాల వల్ల పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తమవుతున్నది. అంత పెద్ద పారిశ్రామికీకరణ జరిగిన మహారాష్ట్ర, అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి. కానీ ఇన్నాళ్ళ తర్వాత కూడా అది సాధ్యం కాలేదు. సీనియర్‌ పాత్రికేయులు పాలగుమ్మి సాయినాథ్‌ వెలువరించిన రిపోర్టు ప్రకారం అత్యధిక ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే జరిగాయి. విదర్భ ప్రాంతమంతా పేదరికంతో అల్లాడుతున్నది. అంబానీ ఆంటీల్లాతో పాటు పేదలకు నెలవైన స్లమ్స్‌ (మురికివాడలు) ముంబైలోనే అత్యధికం. అక్షరాస్యతలో రెండు దశాబ్దాలుగా ఆశించిన అభివృద్ధి లేదు. మరాఠీలు కానీ వారు ఎవరు ముంబై ప్రాంతంలోని పారిశ్రామిక, వ్యాపారాల్లో ఉపాధి చేయరాదంటూ ప్రాంతీయ అస్తిత్వాన్ని రెచ్చగొట్టటం ద్వారా శివసేన పార్టీని స్థాపించిన బాల్‌ ఠాక్రే పార్టీ నేడు చీలిపోవడంతో పాటు జరిగిన పరిణామం ఏమంటే ఆ రాష్ట్రం నుండే ఇతర రాష్ట్రాలకు వలసలు పెరుగుతున్నాయి. నిర్మాణరంగానికి నెలవైన ముంబై నొండి ఇవి నమోదౌతున్నాయి. ఇలాంటి అంశాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించ గలిగిన నిబద్ధతగల పాత్రికేయులకే సాధ్యమవుతుంది. గుత్తాధిపతుల చేతు ల్లో బంధీయైన కార్పోరేట్‌ మీడియా ఈ వాస్తవాలను బయటికి రానీయదు.
విలువలకు వలువలు లేని రాజకీయ వ్యవస్థలో అధికారమే పరమావధి రక్షణగా మారింది. దేశానికి ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలో జరిగే ఆర్థిక అవకతవకలకు అంతే లేదు. ఈ వ్యవహారాల్లో అక్కడి దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని కూడా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా లోపాయికారిగా అధికార పక్షంతో కలిసి ఉండడం వారికి తప్పని పరిస్థితి. అజిత్‌ పవర్‌, ప్రఫూల్‌ పటేల్‌ వంటి అనేక మంది నాయకులు ఇప్పటికే ఈడీ వంటి సంస్థల నిఘాలో ఉన్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాలను కాపాడుకోవడం కోసం రాజకీయ నీతిని పాటిస్తే కుదరని పరిస్థితి అక్కడ ఉన్నది. విధానాల ద్వారా కాకుండా పలు రకాల సమీకరణల ద్వారా ఓట్లు రాబట్టుకొనే కొత్త పంథాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడో ప్రవేశపెట్టారు. వాటికోసం బహుళ జాతి సంస్థల స్థాయిలో వ్యవస్థలు కూడా వెలిశాయి. ఇలాంటి వ్యవస్థల్లో ఆరితేరిన వారే ప్రశాంత్‌ కిషోర్‌. ఇవన్నీ తెలిసి కూడా కురువృద్ధుడు, రాజకీయ దురంధరుడుగా పిలువబడే శరద్‌పవార్‌, పార్టీ అధికారాన్ని తన కూతురుకు అప్పజెప్పి కూడా అందరి నుండి విధేయతను ఆశించడం మతి తప్పిన అతి వివేకమైంది. కనీసం ఆయన చనిపోయిన తర్వాతనైనా పార్టీ పగ్గాలు తనకే అందుతాయి అని ఆశించిన అజిత్‌ పవార్‌కు ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన చేసిన తిరుగుబాటు మహారాష్ట్ర సమాజంలో సమంజసమైంది. ఇక ఆంగ్ల చదువులు చదువుకొని, అనర్గళమైన ఉపన్యాసాలు ఇస్తూ అందరిని ఆకట్టుకుంటున్న ఎన్సీపీ అధ్యక్షురాలు సుప్రియ సూలే రాజకీయానుభవ రాహిత్యంతో పార్టీలో అంత ర్గతంగా ఏర్పడిన ముసలాన్ని గమనించలేక పోయింది. తన వర్గం నుండి చీలిపోయి కొత్త కుంపటి పెట్టుకున్న శివసేన ఎమ్మెల్యేలందరినీ సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటిస్తుందనే ఆశతో ఒరిజినల్‌ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే జరుగుతున్న ఈ పరిణామాలకు స్పందించడం లేదు. తమ ఎమ్మెల్యేలంతా తమ గూట్లో ఉంటే చాలు అన్న క్షణక్షణ భయంతో కాంగ్రెస్‌ ఎదురుచూడడం తప్ప చేసేదేమీలేదు!
జి. తిరుపతయ్య
9951300016

Spread the love