ఇంజినీరింగ్‌ కాలేజీల ధన దాహం ఇంకెన్నాళ్లు?

రాష్ట్రంలో ఎప్పటిలాగే ఇంజినీరింగ్‌ కాలేజీలు కోట్లాది రూపాయల ఫీజు దోపిడీకి తెరదీశాయి. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఇంజినీరింగ్‌ చదవాలనుకున్న విద్యార్థుల కలలను, ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటున్నాయి. ఈ సంవత్సరం 26 జూన్‌ నుండి మొదటి విడత ఇంజినీరింగ్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం కానుంది. ఇది కాకముందే డొనేషన్ల పేరుతో ఒక్కో సీటుకు లక్షలాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. అక్రమంగా డబ్బులు దండుకునేందుకు ప్రత్యేకమైన వ్యవస్థను నడుపుతున్నాయి. పీఆర్‌ఓ, కన్సల్టెన్సీలను పెట్టి ఒక్కో సీటుకి ఒక్కో రేటు నిర్ణయించి విద్యార్థుల రక్తాన్ని ఫీజుల రూపంలో జుర్రుకుంటున్నాయి. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న తతంగమే అయినా ఉన్నత విద్యామండలి, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ స్పందించకపోవడం సగటు తెలంగాణ విద్యార్థిని ఆందోళన పరస్తున్న అంశం. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు గడుస్తున్నాయి. ముఖ్యమంత్రి హామినిచ్చిన ‘జిల్లాకు ఒక యూనివర్సిటీ’ నేటికీ అమలు కాలేదు. కానీ ఏకంగా పది ప్రయివేటు యూనివర్సిటీలకు అనుమతులివ్వడం బాధాకరం. ఇందులో ఇప్పటికే ఐదు యూనివర్సిటీలుగా చలామణి అవుతున్నాయి. వీటికి సంబంధించిన ఫైల్‌ గవర్నర్‌ దగ్గర పెండింగ్‌లో ఉండటంతో పర్మిషన్‌ రాలేదు. అయినప్పటికీ గురునానక్‌, శ్రీనిధి కాలేజీలు యూనివర్సిటీలుగా రన్‌ అవుతున్నాయి. అనుమతులు రాలేదని ఆయా ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి ఈ యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్‌ కాలేజీలు నిబంధన ప్రకారంలేవు. ఏఐసీటీఈ నిబంధన ప్రకారం టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు లేవు. రూల్స్‌ ప్రకారం ఇవ్వాల్సినంత జీతభత్యాలివ్వడం లేదు. ఇచ్చిన మళ్లీ ఉద్యోగుల దగ్గర ఆయా యాజమాన్యాలు దొంగచాటుగా వెనక్కి తీసుకుంటున్నాయి. తగినన్ని లేబరేటరీ లు, లైబ్రరీలు లేవు. అయినప్పటికీ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు, ప్రయివేటు యూనివర్సిటీలు ఒక్కో రూపంలో దోపిడీకి బరితెగిస్తున్నాయి.
రాష్ట్రంలో 2023 సంవత్సరానికి 438ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,87,584 సీట్ల భర్తీకి ఏఐసిటిఈ అనుమతులిచ్చింది. వీటిల్లో 70శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో, 30శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేయాలి. కన్వీనర్‌ సీట్ల భర్తీ పూర్తి చేశాక మాత్రమే మేనేజ్‌మెంట్‌ సీట్లను భర్తీ చేయాలి. కానీ ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు ఈ సీట్ల ప్రక్రియ భర్తీ అవ్వకముందే మేనేజ్మెంట్‌ సీట్ల భర్తీకి పూనుకుంటున్నాయి. కన్వీనర్‌ కోటాలో సీట్లు రాని విద్యార్థులకు ఎరవేసి కన్సల్టెన్సీ ద్వారా తతంగాన్ని నడిపించి ఒక్కో సీటుకు రూ.12 లక్షల నుండి 25 లక్షలు వసూలు చేస్తున్నాయి. ప్రయివేటు యాజమాన్యాలు మేనేజ్‌మెంట్‌ సీట్ల భర్తీ ప్రక్రియపై ఉన్న నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. మేనేజ్‌మెంట్‌ సీట్లలో 15శాతం సీట్లను ఎన్నారై కానీ, ఎన్నారై స్పాన్సర్‌ వారికి ఇవ్వాలి. 15శాతం జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి లేకుంటే ఎంసెట్‌ వారికి ఇవ్వాలి. ఇవి రెండూ లేకుంటే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికివ్వాలి. ఇలాంటి నిబంధనలేవి నేడు ప్రయివేటు కాలేజీలు, యూనివర్సిటీలు పట్టించుకోవడం లేదు. ‘బి’ కేటగిరి సీట్లను ఆదాయ వనరుగా చూసి ఫీజుల దోపిడీ చేస్తున్నాయి. కన్వీనర్‌ కోట సీట్లను కూడా పథకం ప్రకారం మేనేజ్మెంట్‌ సీట్లుగా మార్చి కొన్ని కళాశాలలు కోట్లాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికోసం బ్లాక్‌ సీట్ల దందాకు పాల్పడుతున్నాయి. జేఈఈ పరీక్షల్లో ర్యాంకులు సంపాదించిన విద్యార్థులతో ముందుగానే ఎంసెట్‌ సీట్లను భర్తీ చేయించడం, ఆ తర్వాత వారు జేఈఈ లో వచ్చిన సీట్‌ కోసం వెళ్లేలా చేసి ఎంసెట్‌ సీటును కౌన్సిలింగ్‌ తర్వాత కన్వీనర్‌ కోటా నుండి మేనేజ్‌మెంట్‌ కోటాలో వచ్చేలా చేయడం పరిపాటే అయింది. ఈ సీట్ల బ్లాక్‌ దందా కేవలం ఇంజనీరింగ్‌కు మాత్రమే పరిమితమైంది కాదు. మెడిసిన్‌లో కూడా ఇదే రకంగా బ్లాక్‌ దందాలకు పాల్పడుతున్నాయి.
డొనేషన్ల పేరుతో ఫీజులు దండుకుంటున్న ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు అవి సరిపోవు అన్నట్లు ఫీజుల పెంపునకు సిండికేట్‌గా ఏర్పడి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫ్రీ రెగ్యులేటర్‌ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులు కాకుండా ఎక్కువ వసూలు చేయడానికి ఎత్తుగడలు వేస్తున్నాయి. న్యాయ స్థానాల నుండి ప్రత్యేకమైన అనుమతులు తెచ్చుకుని ఫీజులు పెంచుకున్నాయి. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభమైన మొదటి నుండి నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల ఫీజులను ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు దండుకోవడం పరిపాటిగా మారింది. డొనేషన్లు, బ్లాక్‌ దందాలు, ఫీజులు పెంపులకు పాల్పడుతున్నాయి. వీటన్నింటిపై సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలతోని విచారణ జరిపించి అక్రమ లావాదేవీలు చేసిన ఇంజినీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. వాటి అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేయాలి. ఇలా కఠినంగా వ్యవహరించినప్పుడే సీట్ల భర్తీ పారదర్శకంగా జరిగి అర్హులైన విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉన్నది.
పి. మహేష్‌

Spread the love