హిందూత్వ-కార్పొరేట్‌ కూటమిది ఏ విధానం?

ప్రతీ ఆధునిక సమాజంలోనూ ఫాసిస్టు శక్తులుంటాయి. సాధారణ పరిస్థితుల్లో అవి సమాజ జీవితపు ప్రధాన స్రవంతికి దూరంగానో, కాస్త ఎడంగానో నామమాత్రపు శక్తులుగా కొనసాగుతూ ఉంటాయి. ఒకసారి గుత్త పెట్టుబడిదారీ వర్గం ఈ శక్తులకు మద్దతునివ్వడం జరిగితే అవి అమాంతం కేంద్ర స్థానాన్ని ఆక్రమించు కుంటాయి. గుత్త పెట్టుబడిదారీ వర్గం ఈ ఫాసిస్టు శక్తులకు కావలసినంత ధనాన్ని అందిస్తుంది. విపరీతమైన మీడియా కవరేజి ఇస్తుంది. పెట్టుబడిదారీ సంక్షోభం ఏర్పడి దాని వలన నిరుద్యోగం బాగా పెరిగిపోయి దాని పర్యవసానాలు ఆ గుత్త పెట్టుబడిదారీ వర్గ ఆధిపత్యానికే ఒక సవాలుగా మారినప్పుడు ఆ వర్గం ఫాసిస్టు శక్తులకు పూర్తి మద్దతునందిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో జీవిస్తూ ఆ వ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం ఫలితంగా తీవ్ర పేదరికాన్ని అనుభవించే ప్రజానీకపు దృష్టిని మళ్ళించి సమాజంలో ఎవరో మైనారిటీ మతాలుగానో, మైనారిటీ జాతులుగానో ఉన్న ప్రజల పట్ల విద్వేషాన్ని, శతృత్వాన్ని పెంచడం అనేది ఈ ఫాసిస్టు శక్తులు చేసే పని. దీనికి తోడు ఒకసారి ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రాగానే రాజ్యాధికారాన్ని ఉపయోగించి అణచివేతకు పాల్పడతాయి. అంతే కాక, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని వారిపై ఫాసిస్టు గూండాలను ఉసిగొల్పి నానారకాలుగా లైంగికదాడులకు పాల్పడతాయి. ఈ గూండాలు కేవలం మైనారిటీలనే గాక, ఆలోచనాపరులమీద, మేధావుల మీద, రాజకీయ ప్రత్యర్థులమీద, స్వతంత్రంగా వ్యవహరించే విద్యావేత్తలమీద సైతం దాడులకు తెగబడతాయి.
ప్రస్తుతం భారతదేశంలో ఇదే జరుగుతోంది. ఫాసిస్టు శక్తులు అధికారంలోకి రావడంతోపాటు ఇంకో కొత్త శక్తులు కూడా ముందుకొచ్చాయి. ”నూతన గుత్త పెట్టుబడిదారీ వర్గం” అనేదే ఆ కొత్త శక్తి. ఈ వర్గం ఫాసిస్టు శక్తులతో ఒక ప్రత్యేకమైన సన్నిహిత సంబంధాన్ని కలిగివుంది. డేనియల్‌ గ్యూరిన్‌ అనే ఫ్రెంచి మేధావి ”ఫాసిజం, బడా పెట్టుబడిదారీ వర్గం” అనే తన గ్రంథంలో జర్మనీలో జరిగిన పరిణామాలను ఈ విధంగా వివరించాడు… జర్మనీలో కొత్తగా ఉక్కు, వస్తూత్పత్తి రంగం, ఆయుధాల తయారీ రంగాల్లో తలెత్తిన గుత్త పెట్టుబడిదారీ వర్గం 1930 దశకంలో నాజీలకు సంపూర్ణ మద్దతునందించింది. జౌళి రంగం, వినిమయ వస్తువుల తయారీ తదితర రంగాల్లో ముందునుంచీ ఉన్న గుత్త పెట్టుబడిదారులు అందించిన మద్దతుతో పోల్చితే ఈ కొత్త గుత్త పెట్టుబడిదారీవర్గం అందించిన మద్దతు చాలా ఎక్కువ. దానర్ధం పాత గుత్త పెట్టుబడిదారీ వర్గం నాజీలను బలపరచలేదని మాత్రం కాదు. కొత్తగా తలెత్తిన గుత్త పెట్టుబడిదారీ వర్గం మరింత దూకుడుగా నాజీలను బలపరిచింది. అదే మాదిరిగా జపాన్‌లో నిస్సాన్‌, మోరీ వంటి కొత్త గుత్త పెట్టుబడిదారీ సంస్థలు అక్కడి మిలిటరీ-ఫాసిస్టు ప్రభుత్వాన్ని 1930వ దశకంలో బలపరిచాయి. వాళ్ళతో పోల్చితే పాత గుత్త పెట్టుబడిదారులుగా ఉన్న మిత్సుయి, మిత్సుబిషి, సుమిమోటో వంటి గుత్త సంస్థలు అంత ఉధృతంగా బలపరచలేదు. దానర్ధం ఈ పాత గుత్త సంస్థలు అక్కడి ప్రభుత్వాన్ని బలపరచలేదని కాదు. బలపరిచే ఉధృతిలోనే తేడా ఉంది. జపాన్‌లోని గుత్త పారిశ్రామిక సంస్థలు అక్కడి మిలిటరీ-ఫాసిస్టు ప్రభుత్వాన్ని బలపరిచాయి గనుకనే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓడిపోయిన అనంతరం అక్కడ జనరల్‌ డగ్లస్‌ మెకార్థర్‌ ఆధ్వర్యంలో అమెరికన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అంతవరకూ అక్కడున్న గుత్త పారిశ్రామిక సంస్థలను అన్నింటినీ మూసేసింది (అయితే అలా మూతబడ్డ సంస్థలన్నీ వేరే రూపాల్లో తిరిగి రంగం మీదకొచ్చాయి అన్నది వేరే విషయం). జపాన్‌లో కూడా కొత్తగా ఏర్పడ్డ గుత్త సంస్థలు అక్కడి మిలిటరీ-ఫాసిస్టు ప్రభుత్వానికి తిరుగులేని పూర్తి మద్దతు నందించాయి.
ఇప్పుడు మన దేశంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. కొత్త గుత్త పెట్టుబడిదారీ సంస్థలైన అదానీ, అంబానీలు మోడీ ప్రభుత్వానికి మద్దతును అందించడంలో బాగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. దానికి ఫలితంగా ఈ సంస్థలు పొందుతున్న ప్రయోజనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. వీటితో పోల్చితే ఎప్పటి నుండో గుత్త సంస్థలుగా ఉన్నవి ఈ విషయంలో వెనకబడ్డాయి. దానర్థం ఆ పాత గుత్త సంస్థలు మోడీని బలపరచడానికి విముఖంగా ఉన్నట్టు కాదు. నిజానికి టాటా సంస్థల అధినేత నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి తమ మద్దతు ప్రకటించడం ఆ సంస్థ హిందూత్వ ప్రభుత్వానికి ఎంత సన్నిహితంగా ఉందో సూచిస్తుంది.
గుత్త పెట్టుబడిదారీ వర్గంతో, అందునా కొత్తగా తలెత్తిన గుత్త పెట్టుబడిదారీ శక్తులతో మోడీ ప్రభుత్వం అత్యంత సాన్నిహిత్యాన్ని కలిగివుండడాన్ని తరచూ ‘ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం’ (క్రోనీ క్యాపిటలిజం) అని వర్ణిస్తున్నారు. ఫాసిస్టు శక్తులకు, గుత్త పెట్టుబడిదారీ వర్గానికి, అందునా కొత్త గుత్త పెట్టుబడిదారులకు మధ్య నెలకొన్న సాన్నిహిత్యాన్ని ఇది సూచిస్తుంది. కాని ఈ బంధం తాలూకు నిర్దిష్ట ప్రత్యేక లక్షణాన్ని అది సూచించడం లేదు. కార్పొరేట్‌-హిందూత్వ కూటమి అని ఆ బంధం ప్రత్యేక లక్షణాన్ని గురించి చెప్పవచ్చు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనేది అన్ని తరహాల ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలకూ వర్తించే వర్ణన. అయితే, ఫాసిస్టు శక్తులు ఆధిపత్యంలోకి వచ్చిన ప్రత్యేక పరిస్థితుల నిర్దిష్ట స్వభావాన్ని అది సూచించదు. ఒక అర్ధంలో చెప్పుకుంటే, పెట్టుబడిదారీ విధానం యావత్తూ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో అందరూ ”నిబంధనలకు లోబడి” నడుచుకోవాలి. కాని ఆ నిబంధనల చట్రం లోపలే కొందరు ఆశ్రితులకు ప్రత్యేక ప్రయోజనాలు సమకూర్చవచ్చు.
ఇక గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థలోనైతే రాజ్యానికి, గుత్త పెట్టుబడిదారులకూ మధ్య ఉండే సంబంధం మరింత సన్నిహితంగా తయారౌతుంది. ద్రవ్య పెట్టుబడిపై రుడాల్ఫ్‌ హిల్ఫెర్డింగ్‌ (జర్మనీ) రాసిన ఉద్గ్రంథంలో బ్యాంకులకు, పారిశ్రామిక పెట్టుబడికి మధ్య ”వ్యక్తిగత సంపర్కం” జరిగి, దాని ప్రాతిపదికన ”ద్రవ్య గుత్తాధిపత్య సంస్థలు” ఏర్పడతాయని ఆయన సూచించాడు. అదే మాదిరిగా, ఈ ”ద్రవ్య గుత్తాధిపత్య సంస్థలకు”, ప్రభుత్వానికి నడుమ ”వ్యక్తిగత సంపర్కం” ఉంటుందని కూడా ఆయన సూచించాడు. బహుళజాతి కంపెనీలలో ముఖ్య అధికారులుగా పని చేసినవారు ప్రభుత్వ పదవులలో ముఖ్య స్థానాలను చేపడతారు, అదే మాదిరిగా ప్రభుత్వంలో ముఖ్య పదవులు నిర్వహించినవారు బహుళజాతి కంపెనీలలో ముఖ్య అధికారులుగా నియమించబడతారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలు గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాలను సంరక్షించే విధంగా మలచబడతాయి. ఈ విధంగా గుత్త పెట్టుబడిదారులకు ఎంత అనుకూలంగా మారిపోతున్నా, ఈ వ్యవహారం అంతా కొన్ని ”నియమనిబంధనల” చట్రం లోపలే జరుగుతూ ఉంటుంది.
గ్వాటెమాలాలో అధినేతగా ఉండిన జాకొబో ఆర్బెంజ్‌ ప్రవేశపెట్టిన భూసంస్కరణలు అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఫ్రూట్స్‌ కంపెనీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పరిణమించాయి. అప్పుడు సిఐఎ కుట్ర పన్ని ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. అదే విధంగా ఇరాన్‌లో మొస్సాద్‌ ప్రధానిగా ఉన్న కాలంలో చమురు పరిశ్రమను జాతీయం చేశాడు. దాని ఫలితంగా బ్రిటిష్‌ యాజమాన్యంలో ఉన్న చమురు కంపెనీ తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. అప్పుడు బ్రిటిష్‌, అమెరికన్‌ గూఢచారి సంస్థలు రెండూ కలిసి కుట్ర పన్ని మొస్సాద్‌ ప్రభుత్వాన్ని కూలదోశాయి. అయితే ఈ అన్ని సందర్భాలలోనూ ఆ గూఢచారి సంస్థలు కొన్ని గుత్త పెట్టుబడిదారీ సంస్థల ప్రయోజనాల కోసం కుట్రలు చేశాయి తప్ప అక్కడి ప్రభుత్వాల నియమనిబంధనలను ఎన్నడూ తిరస్కరించలేదు. నిజానికి ఈ రోజు వరకూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఇరాన్‌లో మొస్సాద్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి జరిగిన కుట్రలో తమ ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉన్నట్టు ఒప్పుకోనేలేదు.
అయితే ఫాసిస్టు శక్తులు రాజ్యాధికారాన్ని చేపట్టాక అంతా మారిపోయింది. ఒక మౌలికమైన మార్పే జరిగింది. ”నియమ నిబంధనలు” అనే వాటినే తోసిరాజనే కొత్త పద్ధతి వచ్చింది. ఇది మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మన ప్రధాని అప్పుడే కొత్తగా అనిల్‌ అంబానీ స్థాపించిన సంస్థను రాఫెల్‌ యుద్ధ విమానాల స్థానిక తయారీదారుడిగా గుర్తించాలని ఫ్రెంచి ప్రభుత్వాన్ని కోరాడు. ఇక్కడ గ్లోబల్‌ టెండర్లు పిలవాలన్న నిబంధన గాలికి పోయింది. కనీసార్హతలు ఈ స్థానిక తయారీదారుడికి ఉండాలన్న నిబంధన కూడా అంతే. అప్పటికే విమానాల ఉత్పత్తిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థను సైతం పక్కన పెట్టేశారు. ఎందుకిలా చేశారన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధనం లేదు.
అదే విధంగా అదానీ గ్రూపు ”నియమ నిబంధనలను” ఉల్లంఘించిందన్న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత కూడా అదానీ సంస్థల వ్యవహారం మీద ఎటువంటి విచారణా లేదు. కొన్ని పారిశ్రామిక సంస్థలను ”ఎంపిక” చేసి, ఇతర దేశాలలోని సంస్థలతో జరిగే పోటీలో ఈ ఎంపిక కాబడిన సంస్థలే గెలుపొందేలా బీజేపీ ప్రభుత్వం పథకరచన చేస్తోందని కొన్ని కథనాలు వెలువడ్డాయి. గుత్త పెట్టుబడితో, అందునా, మరీ ముఖ్యంగా కొత్త గుత్త పెట్టుబడితో మోడీ ప్రభుత్వం ఎంత సన్నిహితంగా జతకట్టిందో ఇవి సూచిస్తున్నాయి. ఇటువంటి ”గెలుపు గుర్రాలను” ఎంపిక చేయడంలో ఎటువంటి నియమ నిబంధనలూ ఉండవు అన్నది స్పష్టం. ఈ ప్రభుత్వం హిందూత్వ శక్తులతో జతకట్టిన కొన్ని గుత్త పెట్టుబడిదారీ సంస్థల వ్యాపార సామ్రాజ్యాల విస్తరణకు తోడ్పడుతుంది.
దీనికి బదులుగా, ఈ కొత్త గుత్త పెట్టుబడిదారీ సంస్థలు ఈ హిందూత్వ ప్రభుత్వానికి మీడియా నుండి పూర్తి మద్దతు ఉండేట్టు చూస్తాయి. స్వతంత్రంగా వ్యవహరించే ఒకటో రెండో టివి చానెళ్ళను అదానీ గ్రూపు కొనుగోలు చేసేసింది. దాంతో కార్పొరేట్‌-హిందూత్వ కూటమికి మీడియా నుండి సంపూర్ణ మద్దతు దొరకడం ఖాయం అయిపోయింది.
ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ”ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం” అని చెప్పడమంటే జరుగుతున్న దాన్ని బాగా తక్కువ చేసి చెప్పడమే అవుతుంది. ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అయితే, దీనికి ముందు స్వచ్ఛమైన, పక్షపాతంలేని పెట్టుబడిదారీ విధానం అమలులో ఉండేదని, దానిని అణగదొక్కి హిందూత్వ శక్తులు ప్రస్తుత విధానాన్ని అమలు చేస్తున్నాయని అర్థం వస్తుంది. స్వచ్ఛమైన పెట్టుబడిదారీ విధానం అనేది ఎక్కడా, ఎప్పుడూ లేనే లేదు. పెట్టుబడిదారీ విధానం అంటేనే ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం. గుత్త పెట్టుబడిదారీ విధానం ఉనికిలోకి వచ్చాక ప్రభుత్వానికి, ఆ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అయితే ఫాసిస్టు పాలన వచ్చాక ఈ సంబంధంలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఇక్కడ ఏ నియమాలూ ఉండవు. హిందూత్వ-కార్పొరేట్‌ కూటమి ఏం చేస్తే అదే నియమం
. – స్వేచ్ఛానుసరణ
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love