ప్రపంచీకరణ క్రమం తిరుగుముఖం పడుతోందా?

శ్రామిక ప్రజల జీవితాలను మెరుగుపరచుకోడానికి ఆ దేశంలో ఏర్పడే ప్రభుత్వ స్వభావం మారితే చాలదు. అంటే, ప్రస్తుత అధికార వర్గాల స్థానంలో కార్మిక, కర్షక ప్రజల మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం ఏర్పడితే సరిపోదు. పెట్టుబడులు స్వేచ్ఛగా ఎక్కడికైనా రాకపోకలు సాగించే విధానంతో ఆ ప్రభుత్వం విడగొట్టుకోగలగాలి. కార్మిక, కర్షక తరగతుల మద్దతు మాత్రమే చాలదు. పెట్టుబడుల రాక, పోకలను నియంత్రించగల అధికారం కూడా ఉండాలి. అటువంటి నియంత్రణకు పూనుకుంటే అప్పుడు సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలను ఎదుర్కోవలసివస్తుంది.
చాలామంది ఆర్థికవేత్తలు ఈ మధ్య ప్రపంచీకరణ క్రమం రివర్స్‌ అవుతున్న క్రమం గురించి (డి-గ్లోబలైజేషన్‌) చర్చిస్తున్నారు. నిన్నటి కాలపు నయా ఉదారవాద వ్యవస్థ ఇప్పుడిక ఎంతమాత్రమూ కొనసాగడం లేదని మరికొందరు అంటున్నారు. ”ఒకే నదిలో రెండుసార్లు అడుగుపెట్టలేం” అని గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్‌ ఎప్పుడో అన్నట్టు ప్రపంచంలో ప్రతీదీ ఎల్లకాలమూ ఒకేవిధంగా కొనసాగలేదు. అదేమాదిరిగా నయా ఉదారవాద విధానంలో కూడా కాలం గడుస్తున్నకొద్దీ మార్పులు జరగడం అనివార్యం. అయితే వర్తమాన ప్రపంచంలోని ఆర్థిక వాస్తవికతను గ్రహించి దానిని మార్చడానికి ప్రయత్నించడం ఇప్పుడిక అవసరం లేదా? నయా ఉదారవాద వ్యవస్థను మనం ప్రత్యేకంగా పూనుకుని మార్చనవసరం లేదా? – ఇదీ అసలు ప్రశ్న.
ప్రపంచీకరణ అంటే ఏమిటి? ప్రంచంలోని వివిధ దేశాలు కలిసికట్టుగా ముందుకు వచ్చి అన్ని దేశాలకూ ప్రయోజనకరంగా ఉండేటట్లు ఒక ఆర్థిక వ్యవస్థను రూపొందించుకోవడమే ప్రపంచీకరణ అని అని మనం ఎన్నడూ భావించలేదు. ప్రస్తుతం దాదాపు 50దేశాలు రకరకాల ”ఆంక్షలను” చవిచూస్తున్నాయి. ఆ ఆంక్షల వలన ఆ యా దేశాలకు అవసరమైన సరుకులను ప్రపంచమార్కెట్‌లో అవి పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రాణాలను కాపాడే ఔషధాలను సైతం ఆ దేశాలు పొందడానికి ఇప్పుడు సాధ్యం కావడం లేదు. ప్రపంచీకరణ క్రమం పూర్తిస్థాయిలో ”మంచి ఊపు మీద ఉన్న కాలంలో” అంటే ఒక దశాబ్దం క్రితం కూడా ఈ విధమైన ఆంక్షలను ఎదుర్కొనే దేశాల సంఖ్య ఇప్పుడున్న మోతాదులోనే ఉండింది.
”ప్రపంచీకరణ” గురించి సాధారణంగా చెప్పుకునే అర్థం వేరు, దాని వాస్తవ స్వభావం వేరు. ప్రపంచీకరణ అంటే ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలలోకి పెట్టుబడి, ముఖ్యంగా ద్రవ్య పెట్టుబడి యధేచ్ఛగా సంచరించగలిగే పరిస్థితిని కల్పించే దశ. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకానొక దశ. అది ఆ యా దేశాలు (జాతి రాజ్యాలు) తమకు నచ్చిన విధంగా తమ ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి జోక్యం చేసుకునే శక్తిని ప్రపంచీకరణ బాగా కుదించివేసింది. తన ఆమోదం లేని విధానాలను ఆయా దేశాలు అనుసరించే వీలు లేకుండా ప్రపంచీకరణ చేసింది. అన్నింటికీ మించి ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా చేసే పెత్తనానికి సంపన్న పెట్టుబడిదారీ దేశాలు పూర్తి మద్దత్తునిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికా ప్రపంచీకరణ క్రమానికి లోబడని దేశాల మీద ఆంక్షలు విధించడం ద్వారా తక్కిన అన్ని దేశాలు తమ దారిలోకి వచ్చేలా చేస్తున్నది.
అందుచేత ప్రపంచీకరణ అంటే పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని మళ్ళీ ఈ ప్రపంచంమీద రుద్దే క్రమం అని అర్థం చేసుకోవాలి. అయితే, సోషలిస్టు దేశాల మీద ఆవిధంగా రుద్దడం సాధ్యం కావడం లేదు. కాని, సామ్రాజ్యవాదుల వలస పాలననుండి 20వ శతాబ్దపు నడిమి కాలంలో విముక్తి పొందిన దేశాలమీద ప్రపంచీకరణను రుద్దగలిగారు. ఆ దేశాలలో పెట్టుబడిదారీ విధానాన్ని బలపరిచే ఆర్థిక విధానాలనే చేపట్టినప్పటికీ, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ప్రజా సంక్షేమ విధానాలను అమలు చేస్తూ కొంతమేరకు పెట్టుబడిని నియంత్రిస్తూవుండే విధానాలను అనుసరిస్తూవుండేవి. ఇప్పుడు అక్కడ ఆ విధానాలను కొనసాగించడానికి ప్రపంచీకరణ ఒప్పుకోవడం లేదు. మూడవ ప్రపంచపు సోషలిస్టేతర దేశాలలో సామ్రాజ్య వాదానికి పూర్తిగా లోబడిపోకుండా కొంతమేరకైనా స్వయం ప్రతిపత్తితో వ్యవహరించగల అవకాశాలను ప్రపంచీకరణ పూర్తిగా తొలగించింది. పెట్టుబడి ఎటువంటి ఆంక్షలూ లేకుండా యధేచ్ఛగా ప్రపంచం మొత్తం మీద సంచరిం చడం అంటే దాంతోబాటు సరుకులు, సేవలు కూడా దేశాల ఎల్లలతో నిమిత్తం లేకుండా యధేచ్ఛగా సంచరించడం. (ఆంక్షలకు గురైన దేశాలు తప్ప)
అయితే ఈ ప్రపంచీకరణ కాలంలో కొన్ని దేశాలు కొత్తగా ఆర్థిక శక్తులుగా బలపడ్డాయి. వాటివలన తమ ఆధిపత్యం దెబ్బ తింటుందన్న భయం పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు పట్టుకుంది. ఈ కొత్తగా బలపడిన దేశాలలో రష్యా ఒకటి. సోవియట్‌ యూనియన్‌గా ఉండిన కాలంలో నిర్మితమైన ఉత్పత్తి పునాది బ్రహ్మాండమైన స్థాయిలో ఉండేది. అది రష్యాకు వారసత్వంగా సంక్రమించింది. బోరిస్‌ ఎల్సిన్‌ అధికారంలో ఉన్న కాలంలో రష్యాను తాము లొంగదీసుకోగలిగామని సామ్రాజ్యవాదదేశాలు భావించాయి. కాని బోరిస్‌ ఎల్సిన్‌ దిగిపోయాక రష్యా నూతన నాయకత్వం తమ దేశపు సత్తా ఏమిటో చూపడం మొదలుపెట్టింది. మరోవైపున చైనా ప్రపంచీకరణ క్రమాన్ని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలను బట్టి గాక తనకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అమలుచేయడంతో చాలా వేగంగా అభివృద్ధిని సాధించింది. ముఖ్యంగా సంపన్న పాశ్చాత్య దేశాల మార్కెట్‌ తనకు అందుబాటులో ఉండటం దీనికి తోడ్పడింది.
ప్రస్తుతం ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధించారు. పశ్చిమదేశాలు చైనాతో జరిపే వాణిజ్యం తగ్గిపోయింది. చైనా పట్ల పశ్చిమ దేశాలు రాజకీయంగా అనుసరించిన వైఖరి దీనికి ఒక ముఖ్య కారణం. ఆ విధమైన వైఖరిని, పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అనుసరించడానికి అనేక కారణాలు ఉన్నాయి. తన దేశంలో ఉపాధి అవకాశాలను కాపాడుకోవడం, (నిజానికి చైనా నుండి అమెరికా దిగుమతి చేసుకునే సరుకులలో అత్యధికభాగం అమెరికా అక్కడ పెట్టిన ప్రత్యక్ష పెట్టుబడులతో ఉత్పత్తి అయేవే ఉంటాయి) చైనామీద ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితిని నివారించడం వంటి కారణాలు ఉన్నాయి. ఇక తక్కిన పశ్చిమ దేశాలకు అదనంగా తోడయిన కారణం వాటిపై అమెరికా చేస్తున్న ఒత్తిడి… వీటన్నింటిలోకీ, చైనామీద మరీ అతిగా ఆధారపడకూడదు అన్నదే ప్రధాన కారణం.
జార్జిబుష్‌ (జూ) దేశాధ్యక్షుడుగా ఉన్న నాటినుంచీ ఈ ఆందోళన అమెరికాకు మొదలైంది. చైనా నుండి దిగుమతులు పెరిగిపోతూండడంతో జార్జిబుష్‌ యువాన్‌-డాలర్‌ మారకం రేటును పెంచాలని ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు. ఒబామా హయాంలో కూడా ఈ వైఖరి కొనసాగింది. విదేశాలకు తమ పరిశ్రమలను తరలించాలని ప్రయత్నించిన అమెరికన్‌ కంపెనీలపై ఒబామా అపరాధరుసుం విధించాడు. ఇక డొనాల్డ్‌ ట్రంప్‌ కాలంలో దిగుమతులమీద అదనపు సుంకాలను విధించి తద్వారా దేశీయ ఉత్పత్తులను కాపాడడానికి ప్రయత్నించాడు. ఈ అదనపు సుంకాల తాకిడి తక్కిన దేశాలకన్నా చైనాకే ఎక్కువగా తాకింది.
చైనాతో తమ వ్యాపారాన్ని తగ్గించుకోడానికి పశ్చిమ దేశాలు చేసే ప్రయత్నాల వెనుక ఉన్న రాజకీయ కారణాలు అర్థం కావడానికి రెండు ఉదాహరణలు ప్రస్తావిస్తాను. యూరప్‌లో కర్బన ఉద్గారాలను తగ్గించుకోడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన సోలార్‌ పానెల్స్‌ను దిగుమతి చేసుకోవలసిన అవసరం వచ్చింది. అప్పుడు యూరపియన్‌ యూనియన్‌ ఒక నిబంధనను రూపొందించింది. ప్రపంచ మార్కెట్‌లో 65శాతానికి మించి వాటా ఉన్న ఏ దేశం నుండీ సోలార్‌ పానెల్స్‌ను యూరపియన్‌ దేశాలు దిగుమతి చేసుకోరాదు అన్నదే ఆ నిబంధన. ఈ నిబంధన కేవలం చైనాను దృష్టిలో పెట్టుకునే రూపొందింది. అప్పటికి చైనా అంతర్జాతీయ మార్కెట్‌లో సోలార్‌ పానెల్స్‌ ఉత్పత్తిలో 85శాతం వాటా కలిగివుంది. దానికి కారణం వాటిని చైనా చాలా చౌకగా సరఫరా చేయడమే. చైనా నుండి వాటి దిగుమతిని నిషేధించడం కోసం యూరపియన్‌ దేశాలు ఎక్కువ ఖరీదుకి ఆ పానెల్స్‌ను ఇతర దేశాలనుండి కొనుగోలు చేయడానికి సైతం సిద్ధపడ్డాయి. ఇది కేవలం ప్రపంచ రాజకీయాల బలాబలాలను దృష్టిలో ఉంచుకుని చేసిన రాజకీయ నిర్ణయం అని స్పష్టంగా కనిపిస్తోంది.
అదే మాదిరిగా బైడెన్‌ ప్రభుత్వం చైనాకు సెమి కండక్టర్ల ఎగుమతిని నిషేధించింది. ఈ నిషేధాన్ని అమెరికన్‌ కార్పొరేట్లు సైతం వ్యతిరేకించారు. చైనాలో నడుస్తున్న, నిర్మాణంలో ఉన్న హైటెక్‌ పరిశ్రమలకు, మిలిటరీ టెక్నాలజీకి, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీకి ఈ సెమి కండక్టర్లు కీలకం. అమెరికన్‌ కార్పొరేట్లకు ఆ సెమి కండక్టర్ల ఎగుమతులు బాగా లాభాలను ఆర్జిస్తాయి. అయినా సరే, బైడెన్‌ ప్రభుత్వం చైనాకు వాటిని ఎగుమతి చేయకుండా నిషేధించింది. దీనివెనుక కేవలం అమెరికా అనుసరించే ప్రపంచాధిపత్య రాజకీయాలే ప్రధాన కారణం. చైనాను ఆర్థికంగా, సాంకేతికపరంగా నిస్సహాయ స్థితికి నెట్టాలన్నదే అమెరికా వ్యూహం. చైనామీద ప్రస్తుతం ఎటువంటి ఆంక్షలనూ అధికారికంగా ప్రకటించలేదు. కాని ప్రస్తుతం మనం ఆ దేశంమీద అమెరికా అప్రకటిత ఆంక్షలను అమలు చేయడాన్ని చూస్తున్నాం. రాబోయే కాలంలో అధికారికంగా ఆంక్షలను ప్రకటించినా ప్రకటించవచ్చు. ఆ ఉద్దేశ్యం అయినా ఉండాలి. లేదా కనీసం చైనాను బలహీనపరచాలన్న ఉద్దేశ్యం అయినా ఉండివుండాలి
చైనాపట్ల పశ్చిమదేశాలు ప్రదర్శిస్తున్న వివక్షత ఎటువంటి ప్రభావం చూపనుంది అన్న అంశం ప్రపంచీకరణ క్రమం తిరుగుముఖం పట్టిందన్న ప్రస్తుత చర్చకు దారి తీసింది. చైనామీద అతిగా ఆధారపడకూడదు అన్న పశ్చిమదేశాల ప్రయత్నాలు తమ వ్యాపారాలను ఇతరదేశాలవైపు ఎక్కువగా మళ్ళించడానికి దారి తీస్తున్నాయి. ఆ విధంగా చేయడం వలన ఎక్కువ ధరలను చెల్లించవలసివస్తుంది. అయినా పశ్చిమ దేశాలు ఆ వైఖరినే తీసుకున్నాయి. అమెరికా చైనాతో చేసే వ్యాపారం ప్రసస్తుతం తగ్గిపోడానికి ఇదే కారణం. పశ్చిమదేశాలు ఆంక్షలను విధించిన దేశాల జాబితాలో చైనా కూడా చేరిపోయినట్టే కనిపిస్తోంది. ప్రపంచీకరణ క్రమం ఏ మోతాదులో కొనసాగుతోంది అన్నది అంచనా వేయడానికి ఆర్థికవేత్తలు కొన్ని స్థూల ప్రాతిపదికలను పరిశీలిస్తారు. మొత్తం ప్రపంచ జీడీపీకి, ప్రపంచం మొత్తం మీద జరిగే దిగుమతులకు మధ్య ఉండే నిష్పత్తి అటువంటి ఒక ప్రాతిపదిక. ఆ నిష్పత్తి ఏమీ తగ్గుముఖం పట్టలేదు. మహా అయితే ప్రపంచీకరణ వేగం తగ్గింది అని చెప్పగలమేమో కాని ప్రపంచీకరణ ఏకంగా తిరుగుముఖం పట్టిందని మాత్రం చెప్పలేం.
ప్రపంచీకరణ అంటే ప్రపంచదేశాలు అంతకంతకూ ఒకదానిమీద ఇంకొకటి మరింత ఎక్కువగా ఆధారపడే క్రమం అన్న అభిప్రాయానికి మన దృష్టిలో అంత ప్రాధాన్యత లేదు. ఇది ప్రధానంగా అధికారానికి సంబంధించిన సంబంధం. ఆ అధికారాన్ని ఉపయోగించి, అవసరమైతే ఆంక్షలను ప్రయోగించి అన్ని దేశాలనూ ప్రపంచీకరణ చట్రంలోకి లాగడం. ఈ విధంగా అధికారాన్ని ఉపయోగించడం సామ్రాజ్యవాదపు స్వభావానికి నిదర్శనం. ప్రపంచీకరణ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని స్థిరపరిస్తే, ఆంక్షలు సామ్రాజ్యవాదపు కర్కశత్వాన్ని సూచిస్తున్నాయి… ప్రస్తుతం తిరుగుముఖం పడుతోందని చెపుతున్న ప్రక్రియ వాస్తవానికి ప్రపంచీకరణకు వ్యతిరేకం కాదు. అది నిజానికి ఆ ప్రపంచీకరణకు తోడుగా సాగుతున్న ఒక క్రమం.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రధానంగా సంపన్న పశ్చిమదేశాలనుండే వస్తుంది. ఆ దేశాల కార్యకలాపాలతో ముడిపడిపోయివుంటుంది. అందుచేత అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం అంటే సంపన్న పశ్చిమదేశాల ఆధిపత్యమే తప్ప మరొకటి కాదు. ఈ ఆధిపత్యం ప్రపంచ ప్రజలందరిమీదా చెలాయించడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల ప్రజలమీద చెలాయిస్తున్నారు. ప్రపంచీకరణకు మూడవ ప్రపంచదేశాలలోని బడా బూర్జువా వర్గం మద్దత్తు పలకవచ్చు. ఉన్నత ఆదాయ వర్గాల వారు, డాక్టర్లు, లాయర్లు తదితర ప్రొఫెషనల్స్‌ కూడా మద్దతు పలకవచ్చు. కాని మూడో ప్రపంచదేశాలలోని కార్మికులమీద, రైతాంగం మీద, చిన్న ఉత్పత్తిదారులమీద ప్రపంచీకరణ క్రమం తన అణచివేతను సాగిస్తుంది.
మరో విధంగా చెప్పాలంటే, శ్రామిక ప్రజల జీవితాలను మెరుగుపరచుకోడానికి ఆ దేశంలో ఏర్పడే ప్రభుత్వ స్వభావం మారితే చాలదు. అంటే, ప్రస్తుత అధికార వర్గాల స్థానంలో కార్మిక, కర్షక ప్రజల మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం ఏర్పడితే సరిపోదు. పెట్టుబడులు స్వేచ్ఛగా ఎక్కడికైనా రాకపోకలు సాగించే విధానంతో ఆ ప్రభుత్వం విడగొట్టుకోగలగాలి. కార్మిక, కర్షక తరగతుల మద్దతు మాత్రమే చాలదు. పెట్టుబడుల రాక, పోకలను నియంత్రించగల అధికారం కూడా ఉండాలి. అటువంటి నియంత్రణకు పూనుకుంటే అప్పుడు సామ్రాజ్యవాదం విధించే ఆంక్షలను ఎదుర్కోవలసివస్తుంది. ఒక దశాబ్దం వెనుక కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. ప్రపంచీకరణ క్రమం తిరుగుముఖం పడుతోందని కొందరు ఆర్థికవేత్తలు అంటున్నదానికి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని ఎదుర్కొనే పోరాటానికి, దాని వెనుక దన్నుగా ఉన్న సంపన్న పశ్చిమదేశాల ఆధిపత్యాన్ని ఎదుర్కొనే పోరాటానికి ఏ మాత్రమూ సంబంధం లేదు గాక లేదు.
ప్రభాత్‌ పట్నాయక్‌
(స్వేచ్ఛానుసరణ)

Spread the love