ప్రజాభిప్రాయం-సామ్రాజ్యవాదం

            రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించింది గనుక రష్యా సామ్రాజ్యవాదదేశమే అంటున్నారు. ఆ విధంగా ఆక్రమించడాన్ని ఎవరూ బలపరచనవసరం లేదు కాని, దాని వెనుక పూర్వరంగంలో జరిగిన ఘటనలతో నిమిత్తం లేకుండా ఆ ఒక్కదానినే విడిగా చూడటం సరైనది కాదు. మొత్తం సంఘటనల పరస్పర సంబంధాన్ని చూడవలసిన ఆవశ్యకతను 1915లో లెనిన్‌ ఈ విధంగా వివరించాడు…”సోషలిస్టుల ఎత్తుగడలను నిర్ణయించడంలో మిటిటరీపరంగా మొదటి దెబ్బ ఎవరు కొట్టారన్నది, తొలుతగా యుద్ధాన్ని ఎవరు ప్రకటించారన్నది అప్రస్తుతం అవుతుంది.” అని మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పుడు పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తూర్పు వైపుగా తమ విస్తరణను కొనసాగించాలనుకున్న సందర్భంలో ఉన్నాం.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన ఒకానొక సంస్థ ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని సర్వే చేసి విడుదల చేసిన నివేదికలో వెల్లడైన విషయాలను ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ న్యూస్‌ సర్వీస్‌ ప్రచురించింది. ”అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉండే” తూర్పు ఆసియా, యూరప్‌ దేశాలతోబాటు అమెరికాలో ప్రజల సెంటిమెంటు ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యా, చైనాలకు వ్యతిరేకంగాను, అమెరికాకు అనుకూలంగాను అంతకంతకూ బలపడుతున్నట్టు సదరు సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో తక్కిన దేశాలలో ప్రజాభిప్రాయం దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నట్టు ఆ సర్వే వెల్లడించింది. ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు ఒక దశాబ్దం నుంచీ యూరప్‌, ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని అనేక దేశాలలో ప్రజాభిప్రాయం రష్యాకు అనుకూలంగా మారుతూ వచ్చింది. అదే సమయంలో పశ్చిమ (సామ్రాజ్యవాద) దేశాలలో మరింత వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. ఉక్రెయిన్‌ యుద్ధం వలన ప్రజాభిప్రాయంలో కొత్తగా కలిగిన మార్పు ప్రత్యేకంగా ఏదీ లేదు. చైనా పట్ల ప్రజాభిప్రాయం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఇలా ప్రపంచంలోని రెండు భాగాలలోని ప్రజల సానుభూతి చెరోవైపూ ఎందుకు చీలిపోయి ఉందనే దానికి చెపుతున్న కారణం మాత్రం చాలా పేలవంగా ఉంది. సంపన్న పశ్చిమ దేశాల్లోని అభివృద్ధి చెందిన సమాజాలలో ‘ప్రజాతంత్ర, ఉదారవాద భావాలు’ కలిగివున్న పాలన ఉందని, మూడో ప్రపంచ దేశాలు ‘ప్రజలను అణచివేసే నియంతృత్వ ప్రభుత్వాల’ పాలనలో ఉన్నాయని, ఈ రెండు తరహాల ప్రభుత్వాల దృక్పధాలలోనే పూర్తి తేడా ఉందని ఆ నివేదిక పేర్కొంది. అంతేగాక, అవి పాటించే ‘మౌలిక విలువలలోనే’ పూర్తి తేడా ఉందని చెప్పింది. మూడో ప్రపంచ దేశాల ప్రజలు ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, లౌకిక విధానం తదితర విలువల ప్రాధాన్యతను గుర్తించలేరని, అందుచేతనే వారంతా రష్యా, చైనాలను బలపరుస్తున్నారని ఆ నివేదిక తెలిపింది.
ఈ నిర్థారణను ప్రాతిపదికగా చేసుకుంటే టర్కీ, ఇండియా వంటి ”ఔదార్యం లోపించిన” దేశాలను దూరంగా పెట్టేబదులు, వాటిని తనవైపు ఆకట్టుకునేవిధంగా అమెరికా విదేశాంగ విధానం ఉండాలని ఆ నివేదిక సూచించింది. ఈ సూచన సారాంశం బట్టి టర్కీ, ఇండియా వంటి దేశాలలోని ప్రభుత్వాలు పశ్చిమదేశాల విలువలకు భిన్నమైన విలువలను అనుసరిస్తా యని, అంతేగాక, ఆ ప్రభుత్వాలు తమ తమ దేశాల ప్రజానీకపు మనోభావాలకు అనుగుణంగా నడుస్తాయని అనుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ దేశాల ప్రభుత్వాలను అమెరికా ఏనాడూ దూరంగా ఉంచినది లేదు. అంతేకాదు, ఈ మూడో ప్రపంచదేశాలలోని ప్రజలు తమమనోభావాలను ప్రతిబింబించే ప్రభుత్వాలను ఎప్పుడైనా ఎన్నుకుంటే, ఆ ప్రభుత్వాలను కూలదోయడానికి అమెరికా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతీసారీ ప్రయత్నిస్తూనేవచ్చింది. మనకు వెంటనే గుర్తుకొచ్చే కొన్ని సందర్భాలు-గ్వాటెమాలా (ఆర్బెంజ్‌ ప్రభుత్వం), ఇరాన్‌ (మొస్సాద్‌ ప్రభుత్వం) ఇండోనేషియా (సుకర్నో), చిలీ (అలెండీ) బ్రెజిల్‌ (గౌలార్ట్‌) కాంగో (లుముంబా) బబుర్కినా ఫాసో (సంకరా). అంతేకాదు, తమ తమ దేశాలలో జాతీయ విముక్తి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న ప్రజాదరణ కలిగిన నాయకులను హత్యగావించడానికి కుట్రలు పన్నిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎడ్వర్డో మాండ్లేన్‌, అమిల్కర్‌ కాబ్రాల్‌ వంటి నేతలు ఆ విధంగానే హత్యలకు గురయ్యారు.
ఈ వాస్తవాలతో సంబంధం లేని విశ్లేషణను ఆ సర్వే నివేదిక ప్రకటించింది. మూడవ ప్రపంచ దేశాల ప్రజానీకానికి పశ్చిమ దేశాల ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉండడానికి కారణం ఏమిటన్న ప్రశ్నను ఈ విశ్లేషణ పూర్తిగా విస్మరించింది. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంతో సహా మొత్తంగానే పశ్చిమ దేశాల ప్రభుత్వాల పట్ల మూడవ ప్రపంచదేశాల ప్రజలలో వ్యతిరేకత ఉండడానికి కారణం ఆ దేశాల ప్రజలు పశ్చిమదేశాల సామ్రాజ్యవాద దోపిడీకి ప్రత్యక్షంగా గురవుతూ ఉండడమే. ఆ అనుభవాలే వారిలో ఆ వ్యతిరేకతకు కారణమ య్యాయి. ఆ కారణంగానే ఆ దేశాలలోని ప్రభుత్వాలు సైతం, అవెంత నియంతృత్వ లక్షణాలతో ఉన్నప్పటికీ, అవి అమెరికాకు ఎంత సానుకూలమైన వైఖరిని తీసుకుంటున్నప్పటికీ, ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యాపట్ల సానుభూతి ప్రకటించవలసి వస్తోంది.
అదే పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలలోనైతే, కార్పొరేట్‌ల పెత్తనంలో నడిచే మీడియా నిరంతరం సాగించే ప్రచార హౌరు కారణంగా అక్కడి ప్రజానీకం సామ్రాజ్యవాదం తీసుకున్న వైఖరిని సమర్థించే విధంగా ప్రభావితం చేయబడుతున్నారు.
కాని ఆ ప్రజల వాస్తవ జీవితానుభవాల కారణంగా వారి అభిప్రాయాలు కూడా మారుతున్నాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయినకారణంగా జీవన ప్రమాణాలు దిగజారిపోయి నానా యాతనలూ పడుతున్న యూరపియన్‌ కార్మికవర్గం ఆ ద్రవ్యోల్బణానికి కారణం ఉక్రెయిన్‌ యుద్ధమే అంటూ విమర్శిస్తున్నారు. ఆ యుద్ధం ఇంతకాలం పాటు సుదీర్ఘంగా కొనసాగడానికి కారణం తమ ప్రభుత్వాలు అనుసరించిన వైఖరే కారణమంటూ నిందిస్తున్నారు.
అయితే, ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఒకటుంది. పశ్చిమదేశాల్లోని రాజకీయ పార్టీలు దాదాపు అన్నీ గుండుగుత్తగా అమెరికన్‌ ప్రభుత్వ వైఖరిని సమర్థిస్తున్నాయి. రష్యా నుండి జర్మనీకి భవిష్యత్తులో సహజవాయువు సరఫరా జరగకుండా ఉండేందుకు ఆ ఇరుదేశాలనూ కలిపే నార్డ్‌ స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ను పేల్చివేయడం వెనుక అమెరికన్‌ ప్రభుత్వ కుట్ర ఉంది. ఈ వాస్తవాన్ని అమెరికన్‌ సెనేటర్‌ సైమొర్‌ హెర్ష్‌ స్వయంగా బైట పెట్టాడు. కాని అది ఏవిధమైన కలకలానికీ దారి తీయనేలేదు. ఆ వార్తను అమెరికన్‌ మీడియాలోనే గాక యూరపియన్‌ మీడియాలో సైతం పొక్కనివ్వకుండా తొక్కిపెట్టారు. అక్కడి రాజకీయపార్టీల వైఖరికి ఈ ఉదంతం ఒక మచ్చుతునక.తాము శ్రామికవర్గ ప్రజానీకపు ప్రతినిధులుగా వ్యవహరిస్తామని చెప్పుకునే పార్టీలు, ఆ కార్మికవర్గపు మద్దతును గణనీయంగా పొందగలుగుతున్న పార్టీలు సైతం ప్రజల ప్రయోజనాలను ఈ విధంగా పూర్తిగా విస్మరించి వ్యవహరించడం మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభపుకాలాన్ని గుర్తుకు తెస్తోంది. రెండవ ఇంటర్నేషనల్‌లోని పార్టీలు (సోషల్‌ డెమాక్రటిక్‌ పార్టీలు) తమ తమ దేశాలలోని బూర్జువావర్గం చేస్తున్న యుద్ధ ప్రయత్నాలను పూర్తిగా సమర్థించాయి. 1914లో యుద్ధం ఖర్చుల నిమిత్తం రుణాలను పొందడానికి సంబంధించిన నిర్ణయంపై ఓటింగ్‌ జరుగుతున్నప్పుడు అప్పటికి చాలా బలంగా ఉండిన జర్మన్‌ సోషల్‌ డెమాక్రటిక్‌ పార్టీ (ఆ పార్టీకి ఏకంగా 86దినపత్రికలు ఉండేవి) ఆ బిల్లును బలపరిచింది. ఒకే ఒక్క సభ్యుడు కార్ల్‌ లీబ్కెనెక్ట్‌ మాత్రమే ఆ పార్టీనుండి బిల్లును వ్యతిరేకించి ఓటు చేశాడు. అతడే ఆ తర్వాత కాలంలో జర్మన్‌ కమ్యూనిస్ట్‌ పార్టీని స్థాపించాడు. అనంతరకాలంలో రోజా లక్సెంబర్గ్‌ తోబాటు అమరుడయ్యాడు.
ప్రస్తుతం రష్యాకు వ్యతిరేకంగా జర్మన్‌ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు అందిస్తున్న మద్దతును బలపరుస్తున్నది కేవలం సోషల్‌ డెమాక్రాట్లే కాదు, రాడికల్‌ వామపక్షపార్టీలుగా పరిగణించబడే యూరపియన్‌ లెఫ్ట్‌ పార్టీలు కూడా చాలానే ఉన్నాయి. ఈ యుద్ధం రష్యన్‌ సామ్రాజ్యవాదపు దుందుడుకు వైఖరి ఫలితంగా వచ్చిందని, అందుకే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దత్తునివ్వడమే సరైనదని వాళ్ళు వాదిస్తున్నారు. ఈ యుద్ధం అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యం విస్తరింప జేయడం కోసం మొదలైందనే విషయాన్ని వాళ్ళు విస్మరిస్తున్నారు.
నిజానికి ఈ యుద్ధానికి పూర్వరంగం అమెరికన్‌ పెత్తందారీ వర్గం పన్నిన కుట్రలు. ఉక్రెయిన్‌లో ప్రజలెన్నుకున్న దేశాధ్యక్షుడు విక్టర్‌ యానుకోవిచ్‌ని 2014లో ఆ కుట్రలతోనే పదవీచ్యుతుడిని చేశారు. ఆ తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లో రష్యన్‌ భాషను మాట్లాడే ప్రజలు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో వారిని అణచివేయడానికి పూనుకున్న నేపధ్యంలో ఘర్షణలు తలెత్తాయి. ఆ తర్వాత మిన్క్స్‌లో రష్యాకు ఉక్రెయిన్‌కు మధ్య కుదిరిన ఒప్పందం గనుక అమలులోకి వచ్చివుంటే ఈ యుద్ధమే జరిగివుండేది కాదు. ఆ ఒప్పందానికి అప్పుడు రష్యా కట్టుబడివున్నప్పటికీ, దానిని అమలుకానివ్వకుండా చెడగొట్టింది బ్రిటిష్‌, అమెరికన్‌ ప్రభుత్వాలే. ఆ మిన్క్స్‌ ఒప్పందం చేసుకున్నది దానిని అమలు చేయడానికి కాదని, రష్యాతో యుద్ధం చేయడానికి తగిన సన్నాహాలు చేసుకోవడానికి ఉక్రెయిన్‌కు కావలసిన వ్యవధిని తీసుకోవడం కోసమే ఆ ఒప్పందం చేసుకోవడం జరిగిందని, ఎంజెలా మెర్కెల్‌ (అప్పట్లో జర్మనీ అధ్యక్షురాలు) బహిరంగంగానే ఒప్పుకున్నారు (ఆ తర్వాత ఆ ప్రకటన అమెరికన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిందని గ్రహించి, తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు). మిన్క్స్‌ ఒప్పందాన్ని ఆమోదించి అమలు చేయడానికి రష్యా అంగీకరించడం సామ్రాజ్యవాద స్వభావం ఔతుందా?
రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించింది గనుక రష్యా సామ్రాజ్యవాదదేశమే అంటున్నారు. ఆ విధంగా ఆక్రమించడాన్ని ఎవరూ బలపరచనవసరం లేదు కాని, దాని వెనుక పూర్వరంగంలో జరిగిన ఘటనలతో నిమిత్తం లేకుండా ఆ ఒక్కదానినే విడిగా చూడటం సరైనది కాదు. మొత్తం సంఘటనల పరస్పర సంబంధాన్ని చూడవలసిన ఆవశ్యకతను 1915లో లెనిన్‌ ఈ విధంగా వివరించాడు… ”సోషలిస్టుల ఎత్తుగడలను నిర్ణయించడంలో మిటిటరీపరంగా మొదటి దెబ్బ ఎవరు కొట్టారన్నది, తొలుతగా యుద్ధాన్ని ఎవరు ప్రకటించారన్నది అప్రస్తుతం అవుతుంది.” అని మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పుడు పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులు తూర్పు వైపుగా తమ విస్తరణను కొనసాగించాలనుకున్న సందర్భంలో ఉన్నాం.
ఆ విధంగా వాళ్ళు తూర్పువైపు విస్తరించాల నుకుంటే అందుకు రష్యా ఎందుకు భయపడాలి? అని ఎవరైనా అడగవచ్చు. ఆ విధంగా విస్తరించడం వెనుక దురుద్దేశం ఉన్నట్టు ఎందుకు అనుకోవాలి? సామ్రాజ్యవాదం ఇతర దేశాలను తన పెత్తనం కిందకు తెచ్చుకోవాలంటే ముందు పెద్ద పెద్ద దేశాలను చిన్న చిన్న ముక్కలుగా బద్దలుచేస్తుంది. ఇదే వైఖరి యుగోస్లావియా విషయంలో మనం చూశాం. ఇప్పుడు రష్యా విషయంలో కూడా అదే వర్తిస్తుంది. రష్యా దగ్గర చాలా విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు – ముఖ్యంగా చమురు, సహజవాయువు – ఉండడం వలన వాటిని కొల్లగొట్టుకు పోవాలంటే రష్యాను ముక్కచెక్కలు చేయడం సామ్రాజ్యవాదు లకు మరింత అవసరం అవుతుంది. ఒకసారి రష్యాను ముక్కలు చేయగలిగితే, ఆ తర్వాత మధ్య ఆసియాలోని రిపబ్లిక్‌లపై పట్టు చిక్కించుకోవడం మరింత తేలిక అవుతుంది. ఆ దేశాలలో కూడా ఖనిజ నిక్షేపాల సంపద చాలా ఉంది. ఆ తర్వాత వాళ్ళ దృష్టి చైనాను ముక్కలు చేయడం మీద ఉంటుంది. అందుచేత మనదేశానికి తన సమగ్రతను కాపాడుకోవాలంటే సామ్రాజ్యవాదం విషయంలో స్పష్టమైన వైఖరి ఉండడం అవసరం. అయితే ప్రస్తుతం రష్యా పట్ల దూకుడుగా వ్యవహరించడంతో అమెరికన్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యమే ప్రమాదంలో పడుతోంది. ప్రపంచం మొత్తాన్ని తన పెత్తనం కిందకు తెచ్చుకోవాలనే దాని దురాశే ఇందుకు కారణం. అమెరికా ఆధిపత్యం దెబ్బ తింటోంది గనుక సామ్రాజ్యవాదానికి అసలు ఆ దురాశే లేదనుకోవడం, దాని ప్రమాదాన్ని గుర్తించకపోవడం వలన నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని మూడో ప్రపంచ దేశాల ప్రజలు సరిగ్గానే గుర్తించారు. అందుకే రష్యాకు అంత ఎక్కువ మద్దత్తు లభిస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love