ఖమ్మంలో గాలివాన బీభత్సం

నవతెలంగాణ ఖమ్మం: ఖమ్మంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన వర్షం కురిసింది. బలమైన గాలులు వీయడంతో పట్టణంలో 50కిపైగా కరెంటు స్తంభాలు నేల కూలాయి. 9 చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లకు అంతరాయం కలిగింది. బోనకల్‌ మండలం పందిళ్లపల్లి వద్ద విద్యుత్‌ టవర్‌ కూలిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చింతకాని, నాగులవంచలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. కూసుమంచి మండలం తురకగూడెం డబుల్ బెడ్ రూం ఇండ్లకు సమీపంలో తాడి చెట్టుపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డబుల్ బెడ్ రూం ఇండ్లలో నివసించే వారు భయంలో పరుగులు తీశారు. కాగా, జిల్లా వ్యాప్తంగా వర్షం కురియడంతో నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కాస్త ఊరట కలిగింది.

Spread the love