కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసుపై దాడి


నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో గల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం ఆవరణలో పార్క్‌ చేసిన పదుల సంఖ్యలో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
పార్టీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ఆవరణలోని సీసీకెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడి విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేసింది. ధ్వంసమైన కార్లకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ దాడి బీజేపీ పనేనని ఆరోపించింది. అమేథిలో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, అమేథి, రాయ్‌బరేలీలో నేడు ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దాడి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

Spread the love