రెండు రోజులు కాలేజీలు బంద్ … ఎందుకంటే…

నవతెలంగాణ హైదరాబాద్: మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన భారీ వర్షం, వడగళ్ల వాన కారణంగా పలు ఇళ్లు, అనేక వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంఫాల్ వెస్ట్‌లోని కాంచీపూర్, తేరాతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో మట్టి గుడిసెలు ఎగిరిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. మరోవైపు మంగళవారం వరకు మణిపూర్ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్రంలో మే 6, మే 7న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చినట్టు ఆ రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక వర్షం, వడగళ్ల వాన కారణంగా ఇంఫాల్‌తో సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల్లోని లోయ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలు 4-5 అంగుళాల మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వడగళ్ల వానలో ఇళ్లు దెబ్బతిన్న వారందరూ వాటిని మరమ్మతులు చేయడానికి సంబంధిత డిప్యూటీ కమిషనర్‌లకు వెంటనే ఫోటోగ్రాఫ్‌లను సమర్పించాలని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Spread the love