రాహుల్ గాంధీపై రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు

నవతెలంగాణ హైదరాబాద్: తాము మళ్లీ అధికారంలోకి వస్తే ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ భూమి మీద డైనోసార్‌లు కనుమరుగైనట్టే దేశంలోని రాజకీయ రంగం నుంచి పురాతన పార్టీ కనుమరుగవుతుందని ఆయన కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీని పాకిస్థాన్‌లో అభిమానిస్తున్నారని ఆరోపించిన ఆయన.. గాంధీ కుటుంబానికి భారతదేశంలో రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావును పట్టించుకోలేదు. కానీ, బీజేపీ మాత్రం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించిందన్నారు. మోడీ ప్రధాని అయ్యాక భారత్ ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా దేశం అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ చెప్పుకొచ్చారు. మోడీ నాయకత్వంలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగైదు గంటల పాటు ఆగిపోయిందని.. తద్వారా భారత్ తన 22,000 మంది పౌరులను ఖాళీ చేయగలిగామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి హామీలను బీజేపీ నెరవేర్చిందని చెప్పుకొచ్చారు.

 

Spread the love