తెలంగాణలో రజాకార్ల ఫైల్స్ తీసినా ఇదే ఫలితం తప్పదు. కర్నాటకలో సౌత్ ఇండియా స్టోరీ సూపర్ హిట్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు.. విద్వేష కేరళ స్టోరీని తిప్పి కొడుతూ పరిఢవిల్లిన ప్రజాతీర్పు. ‘రామమందిరం, బజరంగ్‌బళి కూడా బీజేపీని కాపాడలేకపోయాయి’ కర్నాటకలో బీజేపీ ఘోర పరాజయంపై ఇంటర్నేషనల్ హిందూ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా మాటలివి.. ‘కర్నాటక ఫలితాలు బీజేపీకి మేల్కొలుపు లాంటివి. కర్నాటకలో కాంగ్రెస్ సులభంగా మెజార్టీ సాధించింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల తగ్గింపు, నిరుద్యోగ యువతకు ఉపాధి, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు పడతాయి’ అని సూచించడం దేనికి సంకేతం? ఇప్పుడు దేశంలోని ప్రజలెదు ర్కొంటున్న ప్రధాన సమస్యలు కూడా ఇవే కావడం ఇక్కడ గమనించాల్సిన కీల కాంశం… కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కేరళ స్టోరీని కర్నాటక ప్రజలు ఎలా తిప్పికొట్టారో శాసనసభ ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాన్నే ఇచ్చారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించిన కన్నడ ప్రజలకు ధన్యవాదాలు. అదే సమయంలో కన్నడ ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇక హైదరాబాద్, బెంగళూరు పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా యావత్ దేశ వ్యాప్తంగా ఒక స్పష్టమైన మార్పు సంకేతాన్ని సూచిస్తూ, బీజేపీకి ఘోర పరాభవాన్ని చవిచూపించి కన్నడిగులు ఇచ్చిన తీర్పును ఎందుకు అందరూ స్వాగతిస్తున్నా రనేది ఇప్పుడు సర్వత్రా చర్చకు తావిస్తోంది. అంటే కర్నాటక తీర్పులో ఏదో బలమైన సూచన కనిపిస్తోందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణలో రజాకార్ల ఫైల్స్ తెస్తారా..?
ఇప్పటికే జమ్మూకాశ్మీర్‌లోపి పండిట్‌లు, ముస్లింల మధ్య ఉన్నఅంతరాలు అంటూ కశ్మీర్ ఫైల్స్, అభ్యుదయ భావాలకు, లౌకిక వాదానికి పెట్టని కోటలా ఉన్న కేరళ వామపక్ష ప్రభుత్వంపై కేరళ స్టోరీ అంటూ హిందూ మతం నుండి ఒక మతంలోకి మార్పిడులు జరుగు తున్నాయంటూ తీసినట్టుగానే తెలంగాణలోనూ తెలంగాణ సాయుధ పోరాటం నాటి ఘటనలకు ఉటంకిస్తూ రజాకార్ల ఫైల్స్ తీసుకొస్తామన్న చర్చ కూడా జరుగుతోంది. ఇది కూడా రెండు సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఉండొచ్చని కొందరు అభిప్రాయపడు తున్నారు. ఇక కర్నాటక ఫలితాల గురించి చర్చిస్తే… విభిన్న సమూహాలు, జాతులు, కులాలు, మతాలు, ఆచారాలు, సాంప్రదా యాలు, పద్ధతులు కలిగి ఉండి భిన్నత్వంలో ఏకత్వంలా ఒకే దేశంలోని ప్రజలను విభజించే చర్యలకు ఉపక్రమిస్తున్నారా? మనుషుల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారా..? కులమతాలకు ఆజ్యం పోస్తూ లౌకికవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించే చర్యలకు వేగంగా అడుగులు పడుతున్నాయా? పైన చెప్పిన తలపండిన రాజకీయ నాయకులు ఎందుకంతగా స్పందిస్తున్నారో ఇప్పుడు దేశ ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ఇందులో నిజం ఉందా లేదా అనేది కర్నాటకలో కొద్ది నెలలుగా జరిగిన తంతు మనకు కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం కర్నాటక కేంద్రంగా నడిపిన రాజకీయాలు కన్నడిగులను ఎంతలా అసహనానికి గురిచేశాయో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది వాస్తవం. సాక్షాత్తూ భారత ప్రధాని హన్‌మాన్ చాలీసా, జై భజరంగభళి అనడం, రోజుల తరబడి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనడం, కేంద్ర మంత్రి వర్గంలోని పెద్దలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ బీజేపీ నేతలు, సినిమా నటులు సైతం బీజేపీకి ప్రచారం చేశారు. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. అంటే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నేతలు స్పందిస్తున్న కీలక అంశాల్లో వాస్తవం ఉందని రుజువవుతోంది. బీజేపీ చేష్టలకు విసిగి వేసారిన మాజీ ముఖ్యమంత్రి, ఉపముఖ్య మంత్రి సైతం అధికార బీజేపీని వదిలి కాంగ్రెస్, జేడీయూలో చేరడం కూడా బీజేపీ వింత పోకడలు, ప్రజా వ్యతిరేక చర్యలకు అద్దం పడుతోంది.
హిజాబ్‌ను వివాదం చేసిన మంత్రికి చెంపపెట్టు ఫలితం…
వివాదాస్పద మంత్రి, కర్నాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ గతేడాది కర్నాటకలో చెలరేగిన ‘హిజాబ్’ వివాదం దేశంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హిజాబ్ ధరించి అమ్మాయిలు కాలేజీల్లోకి రాకూడదంటూ బ్యాన్ విధించిన బీసీ నగేశ్ ఎన్నికల్లో ఓడిపోయారు. తిఫ్టూర్ నుంచి పోటీ చేసిన ఆయన… కాంగ్రెస్ అభ్యర్థి శాదాక్షరి చేతిలో 17,652 ఓట్లతో ఓటమి చవిచూశారు. అంతేకాదు… 2019లో కాంగ్రెస్, జేడీఎస్ నుండి బీజేపీలో చేరిన 17మంది ఫిరాయింపుదారుల్లో సగం మంది ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సీన్ రివర్స్ అయింది. ఇప్పటిదాకా బీజేపీ సోషల్ మీ కర్నాటకలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. బీజేపీని సౌత్ తరిమి కొట్టింది. హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ‘భజరంగ్‌బళి, కేరళ స్టోరీ, కాంగ్రెస్ టెర్రరిస్టులకు లొంగిపోయింది, కర్నాటకను ఇండియా నుంచి విడగొట్టాలనుకుంటున్నారు’ అంటూ మోడీ చేసిన ప్రసంగాలు బీజేపీని కాపాడలేక పోయాయని కామెంట్ చేస్తున్నారు. ఇంకా బీజేపీ నుంచి ఏకంగా 12మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. వీరిలో సీనియర్ నేతలు శ్రీరాములు, సుధాకర్, మధుస్వామితో పాటు స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్దే కగెరి ఉన్నారు. వీరిలో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. అంతేకాదు గుజరాత్ వ్యూహాలు అంటూ ఊదరగొట్టి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే కర్నాటకలో 75మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చింది. ఇందులో సుమారు 20మంది మాత్రమే గెలిచారు. అది కూడా సాధారణ మెజార్టీతో. బీజేపీ టికెట్ నిరాకరించిన 10మంది కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల్లో చేరి ఘన విజయం సాధించారు.
కన్నడ ప్రజలను అసహనానికి గురిచేసిన బీజేపీ పోకడలు…
కాంగ్రెస్ విజయంలో బీజేపీపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ హామీలు కీలకపాత్ర గృహజ్యోతి: ఇళ్లకు నెలకు 200యూనిట్ల ఉచిత విద్యుత్, గృహలక్ష్మి: ఇంటి మహిళా యజమానికి నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, అన్న భాగ్య: పేద కుటుంబాలకు నెలకు ఒక్కొక్కరికి 10కేజీల ఉచిత బియ్యం, యువనిధి: డిగ్రీ చేసిన నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 శక్తి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి కీలకమైన మ్యానిఫెస్టోలోని అంశాలు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకును టర్న్ చేయగలి గాయి. దీంతో పాటు 20నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టగా, అందులో 15చోట్ల కాంగ్రెస్ విజయం సాధించడం మరో విశేషం. 2018లో ఈ 20 నియోజకవర్గాల్లో 5చోట్లే కాంగ్రెస్ గెలుపొందింది. బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్ర ఎన్నికల్లో మూడు సార్లకు పైగా 40శాతం పైన ఓటు షేర్ సాధించింది. అయితే, కర్నాటక ఎన్నికల గెలుపులో లింగాయత్ సామాజిక వర్గం కీలకంగా మారనుందని ముందు నుంచి రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేసినట్టే లింగాయత్లు ప్రభావితం చేసే 67నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 42చోట్ల గెలుపొందింది. ఇది రాబోవు ఫైనల్ ఎన్నికలకు ఒక సరికొత్త మార్గ నిర్దేశమన్న సంకేతం సర్వత్రా చర్చ జరుగుతోంది. విద్వేషం, మత రాజకీయాలు, మనుషుల మధ్య అంతరాలు, చేసే వారికి సరైన గుణపాఠం తప్పదన్న సంకేతాలు సుస్పష్టంగా కండ్ల ముందు కనిపిస్తున్నాయన్న ప్రచారం దేశవ్యాప్తంగా వినిపిస్తోంది.
వనం నాగయ్య
9441877695