ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారం

– ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి
న్యూయార్క్‌ : ఉక్రెయిన్‌, పశ్చిమ దేశాల తప్పుడు ప్రచారాన్ని ఐరాసలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా ఖండించారు. ఉక్రెయిన్‌లోని కఖోవ్కా జల విద్యుత్‌ కేంద్రంపై కీవ్‌ ఆర్మీ దళాల దాడిని ఆయన విమర్శించారు. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన ఐరాస భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) ప్రత్యేక సమావేశంలో రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ తన అధికార వ్యూహాలుగా పేర్కొనే ఉగ్రవాద విధానాలను బహిరంగంగానే ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్‌, దానికి సాయం అందించిన పశ్చిమదేశాలు ఈ చర్యకు పాల్పడ్డాయని, ఇది యుద్ధ నేరంగా పరిగణించే విధ్వంసక చర్య అని అన్నారు. సాయుధ దళాలను తిరిగి సమూహపరిచేందుకు వీలుగా ఉక్రెయిన్‌ ఈ విధ్వంసక చర్యల ద్వారా అనుకూల పరిస్థితులను సృష్టించుకునేందుకు యత్నిస్తోందని అన్నారు. ఈ విధ్వంసం ప్రణాళిక ప్రకారం జరిగిందని, ఉక్రెయిన్‌ భూభాగానికి, జనాభాకు అధిక నష్టాన్ని కలిగించాలన్న లక్ష్యంతోనే దాడి జరిగిందని అన్నారు. దీంతో నీటితో పాటు జలవిద్యుత్‌ కేంద్రం వంటి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. కఖోవ్కా జలవిద్యుత్‌ కేంద్రాన్ని ధ్వంసం చేయాలనే ఉక్రెయిన్‌ ప్రణాళికల గురించి అంతర్జాతీయ సమాజాన్ని, ఐరాసను రష్యా గతంలోనే హెచ్చరించిందని నెబెంజియా పేర్కొన్నారు. అయితే రష్యా దళాలు డ్యామ్‌ను ధ్వంస చేశాయని ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Spread the love