ఉక్రెయిన్‌కు అమెరికా మిస్సైల్‌ రక్షణ వ్యవస్థ  ధ్వంసం చేసిన రష్యా

కీవ్‌ : ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక పాట్రియాట్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. అంతకుముందు ఇదే రక్షణ వ్యవస్థ రష్యా హైపర్‌ సోనిక్‌ మిసైల్‌ కిన్జాల్‌ను ఆకాశంలోనే అడ్డుకుందని ఉక్రెయిన్‌ పేర్కొంది. రష్యన్‌ మిలిటరీ ఈ విషయంపై ఇతర సమాచారాన్ని ఇవ్వలేదు. అయితే ఉక్రెయిన్‌కు అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థను రష్యా ధ్వంసం చేసిందనే వాస్తవానికి చాలా ప్రాధాన్యత ఉంది.
సోమవారం రాత్రి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ మీద రష్యా తన మిసైళ్ళతో విరుచుకుపడింది. రష్యా ప్రయోగించిన సుదీర్ఘ దూరాలకు చేరుకోగల సామర్థ్యంగల మిసైళ్ళు ముఖ్యంగా హైపర్‌ సోనిక్‌ కిన్జాల్‌ మిసైళ్ళతో పశ్చిమ దేశాలు సరఫరా చేసిన ఆయుధ సామాగ్రి ధ్వంసమైంది. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఒక వీడియోలో రష్యా ప్రయోగించిన మిసైళ్ళను ధ్వంసం చేయటానికి పాట్రియాట్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థ మిసైళ్ళను వరుసగా ప్రయోగించినట్టు కనపడింది.
గతవారం రష్యా ప్రయోగించిన కిన్జాల్‌ హపర్‌ సోనిక్‌ మిసైల్‌ను అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసిందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. అయితే కిన్జాల్‌ వేగాన్ని తట్టుకోగల సామర్థ్యం అమెరికా పాట్రియాట్‌ మిసైల్‌ రక్షణ వ్యవస్థకు లేదని రష్యా తేల్చింది. రష్యా ప్రయోగిస్తున్న కిన్జాల్‌ మిసైళ్ళను నిలువరించటం ఉక్రెయిన్‌ కు పశ్చిమ దేశాలు సరఫరా చేస్తున్న ఆయుధాలకు ఏమాత్రం సాధ్యపడటం లేదు.

Spread the love