అరబ్‌ లీగ్‌లో సిరియా చేరితే కలవరపడేది అమెరికానే : చైనా

12 ఏండ్ల తరువాత సిరియాను అరబ్‌ లీగ్‌లో తిరిగి చేర్చుకోవాలనే నిర్ణయాన్ని అమెరికా తప్ప అన్ని దేశాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అరబ్‌ దేశాల మధ్య సయోద్య కుదరటం ఆ ప్రాంతంలో అమెరికా పలుకుబడి క్షీణిస్తున్నదనటానికి సూచికగా ఉందని కూడా చైనా భావిస్తోంది. ‘ఏవిధంగా చూసినా అరబ్‌ లీగ్‌లో సిరియా తిరిగిచేరటం ఆనందకరమైన విషయం. ఇది ఒకేఒక్క దేశానికి మింగుడుపడటంలేదు’ అని ఒక పత్రికా సమావేశంలో చైనా అధికార ప్రతినిధి పేర్కొన్నాడు. సిరియాని అరబ్‌ లీగ్‌లో చేర్చుకోద్దని అమెరికా ఏమాత్రం సిగ్గులేకుండా తన మిత్రదేశాలపైన వత్తిడి తెచ్చింది. నిజానికి అమెరికా బలవంతంతో విధించిన ఆంక్షలవల్ల సిరియా 12సంవత్సరాలపాటు యుద్ధాన్ని చవిచూసింది. అది వినాశకరమైన పర్యవసానాలకు దారితీసింది.
గతవారం అరబ్‌ లీగ్‌ విదేశాంగ మంత్రులు 2011లో బహిష్కరించిన సిరియాను తిరిగి చేర్చుకోవాలని నిర్ణయించారు. సిరియా అధ్యక్షుడు అల్‌ బషర్‌ ను మార్చాలనే లక్ష్యంతో అమెరికా సాగించిన దమనకాండలో పాల్గొన్న దేశాలు ఈ మధ్యకాలంలో సిరియాతో రాజీపడటానికి సిద్దపడ్డాయి. అమెరికా ప్రోద్బలంతో 12ఏళ్ళపాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధంలో మూడు లక్షలమంది హతులయ్యారు. ఒక కోటి ముప్పై లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సిరియాను అరబ్‌ లీగ్‌లో తిరిగి చేర్చుకోవటంతో మధ్యప్రాచ్యంలో శాంతి, స్థిరత్వం నెలకొంటాయి. ఇది దీర్ఘకాలంలో అరబ్‌ దేశాల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని చైనా అధికార ప్రతినిధి వాంగ్‌ అన్నాడు. అమెరికా, దాని మిత్రదేశాలు ఇతర దేశాలలో అధికారంలోవున్న నాయకులను మార్చటానికి ఆడిన ఆటకు పెట్టిన పేరు ‘స్ప్రింగ్‌’. తమ ఆధిపత్య ప్రయోజనాలకు అనుగుణంగాలేని ప్రతి చర్యనూ ఈ దేశాలు ఖండిస్తాయి. ఇటువంటి కిరాతక రాజకీయ క్రీడ ఇక ఏమాత్రం సాగబోదని కూడా చైనా అధికార ప్రతినిధి చెప్పాడు. అమెరికా నీడ ఎంతగా కుంచించుకుపోతే అంతగా శాంతి, సామరస్యం దేశాల మధ్య వెల్లివిరిస్తుందని ఆయన అన్నాడు.
ఈ మధ్యకాలంలో అస్సద్‌ దళాలు రష్యా, ఇరాన్‌ సహకారంతో అమెరికా మద్దతుగల తిరుగుబాటుదారులను, విదేశీ కిరాయి సైనికులను ఓడించి దేశంలో మూడింట రెండువంతుల భూభాగాన్ని తిరిగి కైవశం చేసుకున్నాయి. 2014 నుంచి అమెరికా సైన్యాలు చట్టవిరుద్దంగా సిరియా సార్వభౌమత్వాన్ని భంగపరుస్తూ ఈశాన్య సిరియాలోని చమురు బావులను ఆక్రమించాయి. అనేక దశాబ్దాలపాటు మధ్యప్రాచ్యంలో ఘర్షణలకు కారణభూతమైన ఇరాన్‌, సౌదీ అరేబియా దేశాల శత్రుత్వం చైనా మధ్యవర్తిత్వంతో కుదిరిన సంధితో సమసిన తరువాత రెండు నెలలకు అరబ్‌ లీగ్‌ సిరియాని తిరిగి తనలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ప్రాబల్యం క్షీణిస్తున్నదనటానికి సంకేతమని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అన్నాడు.

Spread the love