ఫీజుల మోత.. తల్లిదండ్రులకు వాత

– కార్పొరేట్‌ కాలేజీల కాసుల కక్కుర్తి…
– నారాయణ విద్యాసంస్థల ఇష్టారాజ్యం
– ఏటా 20 శాతం నుంచి 40 శాతం వరకు పెంపు
– రూ.వేల కోట్ల విద్యావ్యాపారం
– కనీస వసతులు మృగ్యం
– ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు
– చోద్యం చూస్తున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం, ఇంటర్‌ బోర్డు, అధికారులు, నిపుణుల కమిటీ ఆ ఫీజులను ఖరారు చేయదు. కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలే ఫీజులను నిర్ణయించి వసూలు చేస్తాయి. వాటికి ప్రభుత్వ ఆమోదం కూడా అవసరం లేదు. ఆ కాలేజీలు నిర్ణయించిన ఫీజులే విద్యార్థులు కట్టాల్సి ఉంటుంది.ఆ ఫీజులకు ఎలాంటి హేతుబద్ధత లేకపోవడం గమనార్హం. ఏటా వేల కోట్ల రూపాయల విద్యావ్యాపారం యధేచ్చగా సాగుతున్నది. గతేడాది ఉన్న ఫీజుల కంటే ప్రస్తుత ఏడాది 20 శాతం నుంచి 40 శాతం వరకు ఫీజులను పెంచుతున్నాయి. ఏసీ తరగతి గదులు, ఐఐటీ-జేఈఈ, నీట్‌ వంటి కోచింగ్‌ పేర్లతో మరింత దోపిడీకి పాల్పడుతున్నాయి. ఐపీఎల్‌ సెమి రెసిడెన్షియల్‌, ఐపీఎల్‌ నాన్‌ ఏసీ, ఎన్‌పీఎల్‌ ఏసీ, నాన్‌ ఏసీ, ఎయిమ్స్‌ సూపర్‌ 60 సెమి రెసిడెన్షియల్‌, నీట్‌ ఎంపీఎల్‌ ఏసీ ఇలా వివిధ రకాల పేర్లతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. వాటికి ఒక్కో దానికి ఒక్కో ఫీజును వసూలు చేస్తున్నాయి.
ఏ పేరు పెట్టినా, వాటిలో చేరిన ఒక్కో విద్యార్థికి రూ.రెండు లక్షల నుంచి గరిష్టంగా రూ.నాలుగు లక్షల వరకు ఫీజును గుంజుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీలు కక్కుర్తి పడుతున్నాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్పొరేట్‌ కాలేజీల ఫీజుల మోతతో తల్లిదండ్రులకు వాత పడుతున్నది. ముఖ్యంగా నారాయణ విద్యాసంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఫీజుల కోసం తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నది. పరీక్షలు రాయనీయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నది. సర్టిఫికెట్లు తీసుకునేటప్పు డు మొత్తం ఫీజు కడితేనే ఇస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులపై జులుంను ప్రదర్శిస్తున్నది. ఫీజు కట్టాల్సిందే నంటూ ఒత్తిడి పెంచుతున్నది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వచ్చినా ఆ యాజమాన్యం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
పెరుగుతున్న అంతరాలు
రాష్ట్రంలో 96 శ్రీచైతన్య, 78 నారాయణ కలిపి 174 విద్యాసంస్థలున్నాయి. ఈ రెండు విద్యాసంస్థల్లోనే ఏటా సుమారు 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యారంగంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులకు నాణ్యమైన చదువు, పేదలకు నాసిరకమైన చదువు అన్న పద్ధతులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల్లో రంగు రంగుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో కార్పొరేట్‌ కాలేజీలున్నాయి. అధ్యాపకుల కొరత లేదు. ఇంకోవైపు ఐఐటీ-జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ వంటి కోచింగ్‌లు అదనంగా ఇస్తారు. డిజిటల్‌ తరగతి గదులతో వాటిలో చదివే విద్యార్థులు ముందుంటారు. కానీ మౌలిక వసతుల కొరత, సరిపోయినంత మంది అధ్యాపకుల్లేక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు కునారిల్లుతున్నాయి. గురుకులాలు మాత్రం కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యనందిస్తున్నాయి.
విద్యార్థులపై మానసిక ఒత్తిడి
నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉన్నది. ఒకవైపు మార్కులు, ర్యాంకుల కోసం వెంటపడుతూనే ఇంకోవైపు ఫీజులు కట్టాలంటూ ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అందులో చదివే విద్యార్థులు సూర్యుడిని చూడబోరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సూర్యుడు ఉదయించక ముందే తరగతులకు హాజరు కావడం, సూర్యుడు అస్తవించాక కాలేజీ నుంచి బయటికి రావడం గమనార్హం. హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో నారాయణ జూనియర్‌ కాలేజీలో 12వ తరగతి పూర్తయిన సాయి నారాయణ అనే విద్యార్థిపై మొత్తం ఫీజు కట్టాలంటూ ప్రిన్సిపాల్‌ వేధింపులకు గురిచేశారు.
ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫీజు కోసం నారాయణ కాలేజీ యాజమాన్యం వేధించిన ఈ ఘటన సంచలనమైంది. ఇటీవల మరో కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యం వేధింపులకు నార్సింగిలో మరో విద్యార్థి సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు ఇంటర్‌ బోర్డు చర్యలు చేపట్టింది. ‘కార్పొరేట్‌ కాలేజీల్లో అదనపు తరగతులను మూడు గంటల కంటే అదనంగా తీసుకోవడానికి వీల్లేదు. రెసిడెన్షియల్‌ విధానంలో ఉంటే విద్యార్థులకు కనీసం ఎనిమిది గంటలపాటు నిద్ర ఉండేలా చర్యలు తీసుకోవాలి.’అని ఇటీవల మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంకోవైపు ఇంటర్‌ బోర్డు అనుమతి తీసుకున్నాకే ప్రకటనలు ఇవ్వాలంటూ ఓ కమిటీని నియమించింది. అయినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
ఫీజుల నియంత్రణ కమిటీని నియమించాలి : టి నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, మెడికల్‌ ఫీజుల తరహాలో కార్పొరేట్‌ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ కోసం కమిటీని నియమించాలి. ఫీజుల కోసం ప్రత్యేక చట్టం తేవాలి. పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు ఫీజులను నిర్ధారించడానికి కమిటీలున్నాయి. ప్రయివేటు స్కూళ్లలో గవర్నింగ్‌ బాడీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంజినీరింగ్‌, మెడికల్‌ సహా వృత్తి విద్యా కాలేజీల ఫీజులను తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) నిర్ణయిస్తుంది. కానీ ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంటర్‌ ఫీజులను ఆ కాలేజీ యాజమాన్యాలే నిర్ణయించడం సరైంది కాదు. ఈ దందాను అరికట్టాలి.
కార్పొరేట్‌ కాలేజీల ఆగడాలను అరికట్టాలి : మణికంఠరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు
రాష్ట్రంలో కార్పొరేట్‌ కాలేజీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని ప్రభుత్వం నియంత్రించడం లేదు. ఏసీ, నాన్‌ ఏసీ పేరుతో ట్యూషన్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయి. అయినా ఇంటర్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకే కళాశాల అనుమతి పొంది అనేక బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు.

Spread the love