నేడు తెలంగాణ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమా..

నవతెలంగాణ-హైదరాబాద్ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతన్నలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంట పరిహారం నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంకు వెళ్లి అనుసంధానం చేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది. రాష్ట్రంలో వడగళ్ల వానలకు దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టపరిహారం చెల్లించేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ శాఖ సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద 15 కోట్ల 81 లక్ష ల 41 వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లో భాగంగా మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు కురిసిన వడగండ్ల వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి తదితర పది జిల్లాల్లో పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన అనంతరం 15 వేల 814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 15 కోట్ల 81 లక్షల 40 వేల రూపాయలు రైతులకు పంట నష్టపరిహారం కింద చెల్లించాల్సి ఉన్న దృష్ట్యా, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆగిపోయింది. రైతుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని ఆ మొత్తం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరగా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తదనుగుణంగా నష్టపరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం లోపు పూర్తి స్థాయిలో జమ చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబరుతో లింకేజీ లేకపోతే తక్షణమే బ్యాంకు వెళ్లి రైతులు అనుసంధానం చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రతి రైతు కూడా ఆ మొత్తం నష్టపరిహారం సాయం వ్యవసాయ సంబంధ పెట్టుబడుల కోసం వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా పంట నష్టం సంభవించిన నెలన్నర రోజుల వ్యవధిలోనే ఈ నష్టపరిహారం అందించడం రైతులకు పెద్ద ఉపశమనం కలుగనుంది.

Spread the love