హేతుబద్ద వైఖరితో చైనాతో కలిసి పని చేయండి

–  చైనా అభివృద్ధి నుండి ప్రయోజనాలు పొందండి
–  అమెరికా ఆర్థిక మంత్రితో చైనా ప్రధాని భేటీ
బీజింగ్‌ : హేతుబద్ధమైన, ఆచరణాత్మకమైన వైఖరి పాటిస్తూ, చైనాతో కలిసి పని చేయాల్సిందిగా చైనా ప్రధాని లీ కియాంగ్‌ అమెరికాను కోరారు. గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌లో శుక్రవారం అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెలెన్‌తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధ్యమైనంత త్వరలో చైనా, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరైన దిశగా పట్టాలకెక్కేలా చూడాలని అన్నారు. చైనా-అమెరికా సంబంధాల్లో ”వర్షాలు, గాలులు” తర్వాత ‘హరివిల్లులు’ విరుస్తాయని లీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం యెలెన్‌ బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నాయకత్వంతో సంబంధాలను పెంచుకునేందుకు ఈ పర్యటన ఉద్దేశించబడిందని యెలెన్‌ తెలిపారు. చైనాతో ఆరోగ్యకరమైన ఆర్థిక పోటీని అమెరికా కోరుకుంటోందని చెప్పారు. మరింత సమాచార మార్పిడి జరగాలని యెలెన్‌ కోరారు. ఇదిలా వుండగా, గుత్తాధిపత్యాన్ని, బెదిరింపులను చైనా సహించబోదని లీ కియాంగ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. చైనా అభివృద్ధి అనేది అమెరికాకు సవాలు కన్నా ఒక అవకాశం వంటిదని లీ పేర్కొన్నారు. దీన్ని ముప్పుగా చూడడం కన్నా దీన్నుండి లాభాలు పొందడానికి చూడాలని కోరారు. ఆర్థిక సహకారాన్ని రాజకీయం చేయడం ఇరు దేశాలకు, యావత్‌ ప్రపంచానికి కూడా మంచిది కాదని అన్నారు. ఇరు పక్షాలు కమ్యూనికేషన్‌న పెంచుకోవాలని అన్నారు. ద్వైపాక్షిక ఆర్థిక రంగంలో కీలకమైన అంశాలపై కూలంకష, ఆచరణాత్మక చర్చలు, పరస్పర అభిప్రాయాల మార్పిడి ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నారు. తద్వారా చైనా, అమెరికా సంబంధాల్లో సుస్థిరతను, సానుకూల శక్తిని చొప్పించాలని లీ కోరారు.

Spread the love