బీజింగ్ : చైనాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండగా, మరికొన్ని చోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా వంఝూ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలకు 15మంది మరణించగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో చైనా వరదల నిరోధక సంస్థకి చెందిన వర్కింగ్ గ్రూపు బుధవారం ఉదయం దక్షిణ చైనాలో వరదలతో సతమతమవుతున్న చాంగ్‌కింగ్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ పరిస్థితులను సమీక్షిస్తోంది. మంగళవారం మధ్యాహ్నమే అత్యవసర ప్రతిస్పందనా చర్యలు తీసుకున్న తర్వాత చాంగ్‌కింగ్ అధికారులతో ప్రభుత్వం అత్యవసర సమావేశం జరిపింది. అనంతరం వర్కింగ్ గ్రూపును అక్కడకు పంపించారు. భారీ వర్షాలకు వాంఝూ జిల్లాలో 24 పట్టణాలు, ఉప జిల్లాలు దెబ్బతిన్నాయి. దాదాపు 2వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 570హెక్టార్ల మేరా పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. 3కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.