ప్రజా సంబంధాలే కీలకం

– బిల్‌గేట్స్‌తో భేటీలో జిన్‌పింగ్‌
బీజింగ్‌ : మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌తో శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. ప్రపంచ దేశాల్లో పేదరిక నిర్మూలనకు, ఆరోగ్యం, అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న గేట్స్‌ ఫౌండేషన్‌ కృషిని జిన్‌పింగ్‌ ప్రశంసించారు.
సంబంధిత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, ఇతర వర్ధమాన దేశాలకు సాయం చేయడానికి బిల్‌గేట్స్‌, ఆయన ఫౌండేషన్‌తో కలిసి పనిచేసేందుకు చైనా సుముఖంగా వుందని చెప్పారు. ఈ ఏడాది బీజింగ్‌లో కలిసిన మొదటి అమెరికన్‌ మిత్రుడు మీరేనని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రజల మధ్య నెలకొనే సంబంధాల్లోనే చైనా-అమెరికా సంబంధాల పునాది వుందని తాను తరుచుగా చెబుతుంటానని అన్నారు. అమెరికన్లపై తమకెపుడూ ఆశాభావం వుంటుందన్నారు. ఇరు దేశాల ప్రజలు స్నేహ సంబంధాలను కొనసాగించాలని ఆశిస్తున్నట్లు జిన్‌పింగ్‌ చెప్పారు. వినూత్న అభివృద్ధిని చైనా మరింత వేగిరం చేస్తోందని గేట్స్‌ వ్యాఖ్యానించారు. ఇది చైనాకే కాకుండా, వర్ధమాన దేశాలకు, యావత్‌ ప్రపంచానికి ప్రయోజనకరమని అన్నారు. ప్రజారోగ్యం, ఫార్మాస్యూటికల్‌ పరిశోధన, అభివృద్ధి, గ్రామీణ, వ్యవసాయ రంగాల్లో, వినూత్న అభివృద్ధి, దారిద్య్ర నిర్మూలనా కార్యక్రమాల్లో చైనాతో సహకారాన్ని తమ ఫౌండేషన్‌ బలపరుచుకుంటుందని తెలిపారు.
పోటీ ముసుగులో ప్రయోజనాలు దెబ్బతీయలేరు;అమెరికాపై చైనా ఆగ్రహం
చైనా వ్యక్తం చేసే కీలకమైన ఆందోళనలను అమెరికా గౌరవించాలని, తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం లేదా పోటీ సాకుతో చైనా సార్వ భౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను ప్రమాదంలో పడేయడాన్ని ఆపాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ శుక్రవారం పేర్కొన్నారు. తైవాన్‌ జలసంధిలో సైనిక ఘర్షణ చెలరేగగలదని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింగర్‌ చేసిన హెచ్చరికపై అడిగిన ప్రశ్నకు వెన్‌బిన్‌పై విధంగా స్పందించారు. చైనా-అమెరికా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో వుందని కిస్సింగర్‌ వ్యాఖ్యానించారు. చైనా – అమెరికా సంబంధాలు ప్రపంచ దేశాలకు గొప్ప ప్రాధాన్యత గలవని వాంగ్‌ అన్నారు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ద్వైపాక్షిక సంబంధాల నిర్వహణలో సమాన అవకాశాలు, సమాన సహకారం వుండాలన్న సూత్రాన్ని చైనా ఎల్లప్పుడూ పాటిస్తుందని పేర్కొన్నారు. బాలిలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య కుదిరిన కీలకమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేసేందుకు అమెరికా ఆచరణాత్మక చర్యలు తీసుకోగలదని వాంగ్‌ వెన్‌బిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి సుస్థిరపరిచేలా కమ్యూనికేషన్‌ సంబంధాలను, సహకారాన్ని పెంపొందించేందుకు, అభిప్రాయ భేదాలను సమర్ధవంతంగా తగ్గించుకోవడానికి చైనా తన వంతు కృషి చేస్తుందన్నారు.

Spread the love