టీఎస్‌పీఎస్‌సీ సభ్యుల నియామకాలను

పున:పరిశీలించండి : హైకోర్టు తీర్పు
హైదరాబాద్‌:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెంబర్స్‌ నియామకాలను సవాల్‌ చేసిన కేసులో హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఆరుగురు టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకాన్ని పున: పరిశీలించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. బండి లింగారెడ్డి, కారం రవీందర్‌ రెడ్డి, ఆర్‌.సత్యనారాయణ, రమావత్‌ ధన్‌ సింగ్‌, సుమిత్ర ఆనంద్‌ తనోబా, ఆరవెల్లి చంద్రశేఖర్‌ల నియామకాలను తిరిగి పరిశీలన చేయాలంది. ఆరుగురి నియామకాలను రద్దు చేయాల్సిన పరిస్థితి ప్రస్తుత దశలో అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ 80 పేజీల తీర్పును వెలువరించింది. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్‌ ఎ.వినాయక్‌ రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను అనుమతించింది.
టీఎస్పీఎస్సీ సభ్యులను నియమిస్తూ 2021 మే 19న జారీ చేసిన జీవో 108ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు సుదీర్ఘ వాదనలు పూర్తి చేసి గత ఏడాది డిసెంబర్‌ 1వ తేదీన తీర్పును రిజర్వులో పెట్టింది. ఆరుగురు సభ్యుల నియామకాలు చట్ట నిబంధనలకు అనుగుణంగా చేయాలంది. ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఆరుగురి నియామకం ప్రభుత్వ తాజాగా చేయబోయే కసరత్తుపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం తగిన ప్రక్రియను అమలు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని తీర్పు చెప్పింది.

Spread the love