మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి

– గ్రూప్‌-1 నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థుల్లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని పలువురు నిరుద్యోగ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని డిమాండ్‌ చేశారు. వచ్చేనెలలో గ్రూప్‌-1 తుది కీతోపాటు ప్రిలిమ్స్‌ ఫలితాలను విడుదల చేయనున్న నేపథ్యంలో శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,33,506 మంది హాజరయ్యారు. అయితే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకారం 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. కానీ ప్రశ్నాపత్రం లీక్‌ కావడంతో గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. దీంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు 1:50 నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపికైన 25,150 మంది అభ్యర్థుల జాబితాను కూడా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అయితే జూన్‌లో నిర్వహించిన పరీక్ష ప్రశ్నాపత్రం సివిల్‌ సర్వీసెస్‌లో మాదిరిగా రావడంతో అప్పుడు మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఎంపిక అవుతామో లేదోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే 1:100 నిష్పత్తి ప్రకారం మెయిన్స్‌కు ఎంపిక చేస్తే అభ్యర్థులందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. 2011 తర్వాత తెలంగాణలో తొలి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కావడంతో ఎక్కువ మందికి మెయిన్స్‌ రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్‌-1లో 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయని (2003) గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణ పోలీసు నియామక బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్‌, ఎస్సై ప్రిలిమ్స్‌లో కటాఫ్‌ తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ విపక్షాలు అడిగితే సీఎం కేసీఆర్‌ స్పందించి అంగీకరించారని తెలిపారు. అదే పద్ధతిలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరుతున్నారు. అలా చేయకుండా ఫలితాలు ప్రకటిస్తే గతంలో ఎంపికై ఇప్పుడు కాని వారు కోర్టును ఆశ్రయించి కేసు వేస్తామని పేర్కొన్నారు. 2011 గ్రూప్‌-1లో కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం వల్లే సుప్రీంకోర్టు తీర్పుతో 2016లో మళ్లీ మెయిన్స్‌ నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ అభ్యర్థనను మన్నించి గ్రూప్‌-1లో 1:100 నిష్పత్తితో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని కోరారు.

Spread the love