రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్‌

– 48 గంటలపాటు మూసివేత
– జూన్‌ 4న కూడా అమ్మకాలు నిలిపివేత
– ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశం
– తగిన చర్యలు చేపట్టిన ఆబ్కారీశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లోకసభ ఎన్నికల నేపథ్యంలో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ గురువారం సర్క్యూలర్‌ జారీ చేశారు. మే 13న పోలింగ్‌ సందర్భంగా రెండు రోజులు, జూన్‌ 4న కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు లిక్కర్‌ షాపులు మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల నుంచి 13 సాయంత్రం 5 గంటల వరకు 48 గంటల పాటు, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలు నిలిపేయాలని ఆయన ఆదేశించారు. బైపోల్‌, ఇతర అత్యవసర పరిస్థితుల్లో సైతం నిషేధం వర్తిస్తుందని ఎన్నికల సంఘం ఈ సందర్భంగా పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. ఈసీ ఆదేశం మేరకు పోలింగ్‌, కౌంటింగ్‌ సందర్భంగా మూడు రోజుల పాటు రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో అమ్మకాలు నిలిపేస్తున్నామని పేర్కొంటూ ఆబ్కారీ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మద్యం దుకాణాలతో పాటు డిపోలు, తయారీ, విక్రయాలు నిలిపి వేస్తున్నట్టు పేర్కొంది.

Spread the love