అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఎగిసిపడుతున్న విద్యార్థుల నిరసనలు

Student protests erupting in American universitiesఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌
ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదాన్ని, దానికి అమెరికా అందిస్తున్న ఆర్థిక, సైనిక అండదండలను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున్న విద్యార్థుల నిరసనలు తెలియజేయడానికి కారణాలేమై వుంటాయని అక్కడి అధికార యంత్రాంగం ఇప్పుడు సమాధానాల కోసం అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీల్లో విద్యార్థుల నిరసనాగ్రహాలకు ఆజ్యం పోస్తున్న అంశాలేమిటి? అసలు అమెరికా ఉద్యమ వారసత్వంలో అవి ఎలా భాగమవుతున్నాయనే విషయాన్ని పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయంలో ‘ఆంగ్లం, మాధ్యమాల అధ్యయనం’ విభాగ ప్రొఫెసర్‌ కాథీ న్యూమాన్‌ విశ్లేషించారు. టైమ్స్‌ ప్రతినిధి రుద్రనీల్‌ ఘోష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న అంశాలు కుప్లంగా..
అమెరికా విశ్వవిద్యాలయాలలో పాలస్తీనాకు అనుకూలంగా ఆకస్మిక నిరసనల విస్ఫోటనం తెలియజేస్తున్నదేమిటి ?
ఇది అకస్మాత్తుగా జరిగిందని చెప్పలేం. గతేడాది అక్టోబర్‌ 7న జరిగిన దాడికి ప్రతిగా ఇజ్రాయిల్‌ సాగిస్తున్న మారణకాండను వ్యతిరేకిస్తూ విద్యార్థులు తమ గళం వినిపిస్తునే వున్నారు. అక్టోబరు 7న జరిగిన దాడికి ఇజ్రాయిల్‌ ప్రతిస్పందనపై వారి విమర్శలు, వ్యాఖ్యలతో అక్టోబరు 8నుండి స్వరం వినిపిస్తునే వస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం న్యూయార్క్‌ పోలీసులను పిలిచిన తర్వాత అక్కడి విద్యార్థులపై జరిగిన దాడులతో నిరసన శిబిరాల ఏర్పాటు వ్యూహం దేశవ్యాప్తంగా విస్తరించిందని నేను భావిస్తున్నాను. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక వ్యూహాన్ని విమర్శించడం, అలాగే ఈ తరహాలో నిరసనలు చేస్తున్న ఇతర విద్యార్ధులకు సంఘీభావాన్ని ప్రదర్శించడం ప్రధానంగా కనిపిస్తోంది.
బయటి ఆందోళనకారులు వర్శిటీల్లో విద్యార్ధులను ప్రేరేపిస్తున్నారనే కథనాలను ఎలా చూడాలి?
ఇక్కడ లేవదీస్తున్న అనేక ప్రశ్నల్లో ఇదొకటి. అసలు యూనివర్శిటీ కమ్యూనిటీ అంటే ఏమిటి? ఆ కమ్యూనిటీలో ఎవరుంటారు? వర్సిటీల్లో నిరసనలను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. నిరసనల్లో పాల్గొనే విద్యార్థులపై విదేశీ ప్రభావాలున్నాయని నేను భావించడం లేదు. విద్యార్థులు తమ కళాశాలల్లో తత్వశాస్త్ర తరగతులు, పొలిటికల్‌ సైన్స్‌ తరగతులు, యుద్ధం మరియు హింస వంటి అంశాలపై తరగది గదుల్లో నేర్చుకున్న పాఠాల సారాంశాన్నే విద్యార్థులు నిరసనగా మలిచినట్టు నాకు అనిపిస్తోంది. వాస్తవానికి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలే విద్యార్థులను బయటకు నెట్టేస్తుండటం ఇక్కడి వైచిత్రి. విద్యార్థులను బహిష్కరించడం..రిజిస్టర్ల నుంచి పేర్లు తొలగించడం, క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా గ్రేడ్లు తగ్గించడం చేస్తున్నారు. కాబట్టి ఎవరు విశ్వవిద్యాలయానికి చెందుతారు? అనే ప్రశ్నను విద్యార్థుల నిరసనలు లేవనెత్తుతున్నాయి. సంవత్సరానికి 70,000 డాలర్లు చెల్లించే ఒక యువకుడు ఆ విశ్వవిద్యాలయ కమ్యూనిటీకి చెందుతాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
కొంతమంది నిరసనకారులు యూదులకు వ్యతిరేకంగా మాట్లాడగలిగే వాక్చాతుర్యాన్ని కలిగి ఉన్నారనే వాదనలు గురించి చెబుతారా!
ఎవరైనా యూదు వ్యతిరేక చర్యలు తీసుకున్నా నేను ఖండిస్తాను. నేను మూడు ఆరోపణలు విన్నాను. యూదులకు, ఇజ్రాయిల్‌ విద్యార్ధులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు, వేధింపులు ఈ నిరసనలు, ఆందోళనల్లో వున్నాయనేది అందులో మొదటి ఆరోపణ. యూదు నిరసనకారులు, ముస్లింలు, అరబ్బులు పట్ల అలాగే నిరసనకారుల శరీర రంగును విమర్శిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, వేధింపులు ప్రతికూల నిరసనల్లో వున్నాయనేది రెండో ఆరోపణ. సాయుధ పోలీసులు హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తూ, విద్యార్థులు చదువుకునేందుకు ఏమాత్రమూ భద్రత లేని వాతావరణాన్ని సష్టించారన్నది మూడో ఆరోపణ. ఈ ఆరోపణలన్నింటికీ మద్దతునిచ్చేలా పోలీసు చర్యలు, నినాదాలు, కొంతమంది వ్యవహార శైలి, సంకేతాలను నేను ప్రత్యక్షంగా చూశాను. కానీ ఇక్కడ చాలామంది నిరసనకారులు లక్ష్యం యూదు వ్యతిరేకత లేదా ఇజ్రాయెల్‌ నిర్మూలన అని అనుకోవడం లేదు.
 ఈ నిరసనలు అమెరికా విద్యారంగంలో పాతుకుపోయిన వామపక్ష ప్రేరణలచే నడపబడుతున్నాయనే భావించవచ్చునా?
ఈ భావనకు ఎప్పుడో చాలా కాలం క్రితమే కాలం చెల్లిపోయింది. విద్యార్థులు ఏం డిమాండ్‌ చేస్తున్నారు, వారు చదువుకునే విద్యా సంస్థల్లోనే ఈ డిమాండ్లు వారెందుకు చేస్తున్నారనేది సరైన ప్రశ్న. వియత్నాంలో ఉన్నట్లుగా సైనిక ముసాయిదా లేదు. కానీ ఇప్పుడు అక్కడ ఏమి ఉందో నేను మీకు చెప్తాను: కుంగదీస్తున్న విద్యార్థి రుణం వుంది. ఇజ్రాయెల్‌కు 26 బిలియన్‌ డాలర్లు పంపుతూ అమెరికన్‌ కాంగ్రెస్‌ ఇటీవలే ఒక బిల్లును ఆమోదించింది. ఆ మొత్తం డబ్బుతో విద్యార్థుల రుణంలో గణనీయమైన మొత్తాన్ని తుడిచిపెట్టవచ్చు. వియత్నాంలో లాగా విద్యార్థులు భౌతికంగా రూపొందించబడరు, కానీ వారి ఆర్థిక భవితవ్యాలు రూపొందించబడుతున్నాయి. ఈ యుద్ధానికి మద్దతుగా అమెరికా అపారమైన మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తోంది. ఇజ్రాయిల్‌కు అమెరికా ఈ సహాయాన్ని అందించకపోతే, ఇజ్రాయెల్‌ ఇప్పుడు చేస్తున్న తరహాలో ఈ సైనిక కార్యకలాపాలను నిర్వహించలేదు. అక్టోబరు 7 నుండి కూడా ఇజ్రాయిల్‌ చర్యలను, అలాగే వాటిని అమెరికా సమర్ధించడాన్ని లేదా ప్రోత్సహించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న ప్రాంతాల నుండే విద్యార్ధుల డిమాండ్లు వస్తున్నాయి.
ఈ నిరసనలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేస్తాయని మీరు అనుకుంటున్నారా ?
అధ్యక్ష ఎన్నికలా ! అమెరికా రాజకీయాల గురించి అస్సలు నాకు పట్టని విషయాల్లో ఒకటి, తదుపరి అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనేది. సాధారణంగా అధ్యక్ష ఎన్నికలకు దాదాపు రెండు సంవత్సరాల ముందు నుండే ఈ ఊహాగానాలు ప్రారంభమవుతాయి. ఇది అస్సలు భరించలేని విషయం. ఆపై ఈ ఆందోళనలకు సంబంధించిన చాలా కవరేజ్‌ ‘ఈ నిరసనలు బైడెన్‌కు మంచివా లేదా చెడ్డవా’ ట్రంప్‌కు మంచివా లేదా చెడ్డవా’ అని విశ్లేషించడానికే మొగ్గు చూపుతాయి. దీనివల్ల అసలైన అంశం ప్రాముఖ్యతను కోల్పోతుందని భావిస్తున్నాను. ఈ నిరసనలు చాలా స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి, అది ఇజ్రాయెల్‌ పట్ల అమెరికా అనుసరించే విధానం. ఇందులో యూనివర్శిటీ ఎండోమెంట్‌ సంస్థలు ఆయుధ కంపెనీలలో పెట్టుబడి పెట్టే విధానాన్ని కలిగి వుండడం వంటివి వున్నాయి. రక్షణ శాఖ నుండి మా విశ్వవిద్యాలయానికి అపారమైన నిధులు వస్తాయి. కాబట్టి విశ్వవిద్యాలయాలు, అమెరికా సైనిక సాంకేతికత మరియు సైనిక విధానానికి మధ్య ప్రత్యక్ష సంబంధం వుంటుంది.
ఇక్కడ సోషల్‌ మీడియా, డీప్‌ఫేక్‌ల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా?
అదేమీ నాకు పెద్ద ఆందోళనే కాదు. అంతకన్నా మరింత ముఖ్యమైన వాటిపైనే నేను దష్టి సారిస్తాను. ఉన్నత విద్య యొక్క ఊహించిన లక్ష్యం విద్యే, కానీ ఇక్కడ నేను ఈ నిరసనలు, ఆందోళనలను చూసినప్పుడు, విద్యార్థులు బోధించడాన్ని, పరస్పరం సహకరించుకుంటూ సమావేశాలు నిర్వహించడానిన, కలిసి తినడాన్ని, ఒకరి సంస్కతుల గురించి మరొకరు తెలుసుకోవడాన్ని చూస్తున్నాను. ఈ నిరసనలు ఉన్నత విద్యకు సంబంధించి అత్యుత్తమమైనదానికి ప్రతిబింబమని నేను భావిస్తున్నాను. అందువలన, విశ్వవిద్యాలయం యొక్క ఆత్మ (తీరు, లక్ష్యం, ఆలోచనలు) గురించే నేను నిజంగా చింతిస్తున్నాను. నావరకు, ఈ విద్యార్థులే విశ్వవిద్యాలయం యొక్క ఆత్మను సూచిస్తారు. పెద్దలుగా, అధ్యాపకులుగా, నిర్వాహకులుగా, ఇప్పటి నుండి మేము మా విద్యార్థులు చెప్పేది వినాలి.

Spread the love