అదానీ, అంబానీలకు మోడీ ఊడిగం

CM REVANTH– అధికారమిస్తే రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటాం
– రైతుల రుణాలు మాఫీచేస్తాం..
– కుటుంబంలో మహిళ పేర అకౌంట్‌లో రూ.లక్ష డిపాజిట్‌
– జూన్‌ 7న ఇండియా బ్లాక్‌ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం : మెదక్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం నర్సాపూర్‌ సభలో.. కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ
– దేశ చరిత్రలో మెదక్‌ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత
– గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో.. పేదల భూములు గుంజుకుంది
– లక్ష మెజారిటీతో నీలం మధును గెలిపించాలి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్‌
బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయ నాయకులు రాహుల్‌ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టారే తప్ప దేశ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మార్చిన ఘనత ప్రధానమంత్రికే దక్కిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీకి దేశంలో 25 మంది మాత్రమే ముఖ్యమని, దేశ ప్రజలు ముఖ్యం కాదన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిసి రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. పెద్దల అప్పులను మాఫీ చేసిన మోడీ.. రైతుల అప్పులు మాత్రం మాఫీ చేయలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే మొదట రైతులకు రుణమాఫీ చేస్తామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధమైన మద్దతు ధరను అందిస్తామన్నారు. ఆశ, అంగన్వాడీలకు వేతనాలు రెట్టింపు చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ చేయని పనిని తాము చేయబోతున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసుకొని ఆ కుటుంబంలో విద్యా వైద్యానికి ఆటంకం కలగకుండా వారి అకౌంట్‌లో లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తామని తెలిపారు. దేశంలో పేదరికం అనేదే ఉండకుండా తమ ప్రభుత్వం పనిచేయబోతుందని గుర్తు చేశారు. జూన్‌ 7వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో మీ కోసం సైనికుడిగా పహారా కాస్తానని రాహుల్‌ గాంధీ ప్రజలకు హామీ ఇచ్చారు.
దేశ చరిత్రలో మెదక్‌ జిల్లాకు ప్రాముఖ్యత : సీఎం రేవంత్‌రెడ్డి
దేశ చరిత్రలో మెదక్‌ జిల్లాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. మెదక్‌ పార్లమెంటు స్థానం నుంచి 1980లో మొట్ట మొదటిసారిగా ఇందిరాగాంధీ ఎంపీగా ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. మెదక్‌ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాల పదేండ్ల పాలనలో దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టుల పేరుతో పేద ప్రజల భూములను గుంజుకుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మెదక్‌ జిల్లాలో మొనగాడు దొరకలేడా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం రాముని పేరు మీద రాజకీయం చేస్తుందని దేవుడు గుడిలో ఉండాలని, భక్తి గుండెల్లో ఉండాలంటూ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌, హరీశ్‌రావుకు దిమ్మతిరిగేలా కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధును లక్ష మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్‌ మున్షీ, ఏఐసీసీ నాయకులు కుసుంకుమార్‌, మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కొండా సురేఖ, మెదక్‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌, ఎంపీ అభ్యర్థి నీలం మధు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, చిలుముల మదన్‌రెడ్డి, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్‌, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, నర్సాపూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love