ఇండియా జీతేగా..

– కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వం ఏర్పాటు
– ఎన్నికల తరువాత దేశంలో పెనుమార్పులు
– మోడీకి ఓటమి కనిపిస్తోంది : సీతారాం ఏచూరి
అమరావతి: దేశంలో ఇండియా వేదిక పార్టీలదే గెలుపని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. గురువారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల తరువాత దేశంలో పెనుమార్పులు జరుగుతాయని అన్నారు. వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటున్నా ప్రజలు మాత్రం పేదరికంలో ఉన్నారని వివరించారు. ద్రవ్యోల్బణం, ఉపాధిలేమి పెరుగుతున్నాయని, అదే సమయంలో ఒకశాతం వ్యాపారవేత్తల చేతుల్లో పోగుపడిన సొమ్ము 70 శాతం మంది ప్రజల ఆదాయాలతో సమానమని తెలిపారు. బీజేపీ మరోసారి అధికారంలోకొస్తే దేశంలో రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఉన్న చట్టాలను సమూలంగా మార్చేస్తారని, ఇప్పటికే మతోన్మాద ఎజెండాతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. పార్లమెంటు, జ్యుడీషియరీ, ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు తాము ఫిర్యాదు చేస్తే కనీసం ఎక్నాలడ్జ్‌మెంట్‌ ఇచ్చే పరిస్థితి కూడా లేదని పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ రాజకీయ ఏజెన్సీలుగా మారిపోయాయని, పదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో పేదల జీవనం కష్టంగా మారిందని, దీనిపై ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడటం లేదని అన్నారు. నల్లధనం లేకుండా చేస్తానని చెప్పిన ప్రధాని ఇప్పుడు అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు నల్లడబ్బు ఇస్తున్నారని చెబుతున్నారని, దేశంలో ఇంకా నల్లడబ్బు ఉందని మోడీనే ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మరి అంత డబ్బు చేతులు మారుతుంటే ఈడీ ఏమిచేస్తుందో మోడీ చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఉన్న పోర్టులు, మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులన్నీ అదానీ, అంబానీలకు ఇచ్చారని, రూ.17 వేల కోట్ల ఆస్తి ఉన్న అదానీ.. మోడీ అండతో ఇప్పుడు ప్రపంచ కుబేరుడుగా మారాడని, అదే అదానీపై మోడీ విమర్శలు చేస్తున్నారని, ఓటమి భయానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేమి కావాలని అన్నారు. ఉత్తర భారతదేశంలో ఇండియా వేదిక పార్టీలకు సీట్లు పెరుగుతున్నాయని, బీజేపీకి తగ్గుతున్నాయని తెలిపారు. ఏపీలో టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీల అండతోనే బీజేపీకి ఒకటీ అరా సీట్లు వస్తాయని, నేరుగా బీజేపీ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు తగ్గుతాయని తేలిపోయిందన్నారు. మోడీ అవినీతిని కూడా చట్టబద్ధం చేశారనటానికి ఎన్నికల బాండ్లే నిదర్శమని తెలిపారు. నష్టాల్లో ఉన్న కంపెనీలు ఎక్కువ ఎన్నికల బాండ్లు కొని బీజేపీకి ఇచ్చాయని, అన్నివేల కోట్లు వాటికి ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. విదేశీ నల్లధనమా, డ్రగ్స్‌ మాఫియా, ఆయుధ స్మగ్లరు ఇచ్చారో మోడీ సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. అదే సమయంలో కంపెనీలపై ఈడీ దాడులు చేయడం, ఆ కంపెనీలు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి వందల కోట్లు ఇవ్వడం జరిగిపోయాయని, ఈ పద్ధతుల్లో మోడీ అవినీతిని చట్టబద్ధం చేశారని పేర్కొన్నారు. కుంభకోణాలు, మైనార్టీలపై దాడులూ పెరిగాయని అన్నారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు అంటున్నారని, మణిపూర్లోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్లు మైనార్టీలు, దళితులు, గిరిజనులపై దాడులు, బుల్డోజర్‌తో కూల్చివేతలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఆర్థిక, సామాజిక, విద్యా విషయకంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని రద్దు చేస్తామంటే వారి హక్కులను నాశనం చేయడం, వారి మనుగడను ప్రశ్నార్థకం చేయడమేనని తెలిపారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వల్లే నాయకులు ఐక్యం కావాల్సి వచ్చిందని వివరించారు. ఏపీలో బీజేపీతో కలవడం వల్ల చంద్రబాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువని అన్నారు.

Spread the love