తేజస్వీ జీపులో రాహుల్‌ .. స్వయంగా డ్ర్రైవ్ చేసిన ఆర్జేడీ నేత

నవతెలంగాణ హైదరాబాద్: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’లో రాష్ట్రీయ జనతాదళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ శుక్రవారం పాల్గొన్నారు. సాసారామ్‌లో జరిగిన ఈ యాత్రకు ఆర్జేడీ నేత ఎరుపు రంగు జీప్‌ రాంగ్లర్‌ వాహనంలో వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్‌, ఇతర కీలక నాయకులు ఆ వాహనంలో ఎక్కగా తేజస్వీ స్వయంగా డ్రైవింగ్‌ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అక్కడ యాత్ర జరిగినంత సేపు ఆయన వాహనాన్ని నడపడం గమనార్హం. ఈ ఫొటోలను తేజస్వీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. సాసారామ్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభం అని క్యాప్షన్‌ జత చేశారు. జేడీయూ-ఆర్జేడీ బంధం ముగిశాక వీరిద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి.
బిహార్‌లో ఈ యాత్ర ప్రస్తుతం తుది దశకు చేరింది. నేటి సాయంత్రానికి ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. ‘‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నేడు 34వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ రోహ్‌తాస్‌లో రైతు నాయకులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2.30కు తేజస్వీ, రాహుల్‌ కలిసి కైముర్‌లోని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ యాత్ర యూపీలోకి ప్రవేశిస్తుంది’’ అని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ తెలిపారు. ఈ యాత్రలో భాగంగా గురువారం రాత్రి బిహార్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దుకు చేరుకున్న రాహుల్‌గాంధీ బృందం ఓ ప్రభుత్వ కళాశాలలో రాత్రిబస చేసేందుకు జిల్లా అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో భదోహీ పొలాల్లో బస చేశారు. శని, ఆదివారాల్లో జరగనున్న పోలీసు నియామక పరీక్షకు ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆ కళాశాల కూడా ఉన్నందున అనుమతి నిరాకరించినట్లు ఏఎస్పీ రాజేశ్‌ భారతి వివరణ ఇచ్చారు. రాహుల్‌ బసకు అధికారుల నుంచి తాము ముందే అనుమతి కోరినా, కావాలనే నిరాకరించినట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేంద్రకుమార్‌ దూబే ఆరోపించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల మీదుగా 785 కిలోమీటర్ల మేర ఏడు రోజులపాటు యాత్ర కొనసాగనుంది. నేడు యూపీలో మొదలయ్యే యాత్ర.. ఫిబ్రవరి 25 తేదీ వరకు జరుగుతుంది. మధ్యలో 22, 23 తేదీల్లో విరామం ఇచ్చారు.

Spread the love