కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్‌..

నవతెలంగాణ ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం ఆవరించి ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను విభాగం ఫ్రీజ్‌ చేసినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. వాటిలో యూత్‌ కాంగ్రెస్‌ ఖాతా కూడా ఉందని తెలిపారు. ఈ ప్రకటన చేసిన గంట తర్వాత.. ఆ ఖాతాలను పునరుద్ధరించారు. దీనిపై ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో అప్పీల్‌ చేయడంతో ఉపశమనం లభించింది. రూ.210 కోట్ల పన్ను రికవరీ నిమిత్తం ఆదాయపన్ను శాఖ వీటిని ఫ్రీజ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే దెబ్బ అని ఆ పార్టీ ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ…‘బీజేపీ సేకరించిన సొమ్మును ఎన్నికల్లో వినియోగిస్తారు. కానీ మేం క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా సమీకరించుకున్న నిధుల్ని అడ్డుకుంటారు. అందుకే.. భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని నేను చెప్పాను. దేశంలో బహుళ పార్టీ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని న్యాయవ్యవస్థను అభ్యర్థిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎన్నికల బాండ్లు` రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఆ మరుసటి రోజే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆ పార్టీ ప్రతినిధి అజయ్‌ మాకెన్‌ మాట్లాడుతూ…‘‘విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి ప్రస్తుతం మా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. న్యాయ యాత్రతో పాటు పార్టీకి చెందిన రాజకీయ కార్యకలాపాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. మేం జారీ చేసిన చెక్కులను బ్యాంకులు అంగీకరించడం లేదని మాకు సమాచారం అందింది. కాంగ్రెస్‌, యూత్‌ కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయి. క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బు నిలిచిపోయింది’’ అని తెలిపారు. ఈ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమైనదని, తమ ఎన్నికల సంసిద్ధతను దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Spread the love