33 మంది ఎంపీలు సస్పెండ్..

నవతెలంగాణ ఢిల్లీ: పార్లమెంట్‌ (Parliament)లో గతవారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. లోక్‌సభ (Lok sabha)లో ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీలపై స్పీకర్‌ మరోసారి సస్పెన్షన్‌ (Suspension) వేటు వేశారు. కాంగ్రెస్‌ (Congress) సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్‌ చేయగా.. మరో ముగ్గురి సస్పెన్షన్‌ అంశం పెండింగ్‌లో ఉన్నట్టు అధికారిక వర్గాల సమాచారం. ఎంపీలు కె. జయకుమార్‌, విజయ్‌ వసంత్‌, అబ్దుల్‌ ఖలీఖ్‌ స్పీకర్‌ పోడియంను ఎక్కి నినాదాలు చేశారు. వీరి సస్పెన్షన్‌కు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ, ఆ పార్టీ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌, డీఎంకే ఎంపీలు ఎ.రాజా, టీఆర్‌ బాలు, దయానిధి మారన్‌, టీఎంసీ ఎంపీలు సౌగతా రాయ్‌, కల్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌, శతాబ్ది రాయ్‌ తదితరులు ఉన్నారు. సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కాగా.. లోక్‌సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమావేశాల్లో ఇప్పటివరకు మొత్తం 46 మందిని లోక్‌సభ నుంచి సస్పెండ్‌ చేసింది. మరోవైపు, రాజ్యసభలో టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌పై ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంది.

Spread the love