నవతెలంగాణ న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్ పడేలా కనిపిస్తున్నది. రాష్ట్రంలో పార్టీ అగ్రనాయకులైన సీఎం అశోక్ గెహ్లాట్ , మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం నడుంబిగించింది. ఇందులో భాగంగా ఇరువురు నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో జరిగిన ఈ భేటీ సోమవారం అర్ధరాత్రివరకు కొనసాగింది. ఇందులో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీనియర్ నేత జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెహ్లాట్-పైలట్ మధ్య కుదిరినట్టు తెలుస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు ఇద్దరు నేతలు అంగీకరించినట్టు ఆయన వెల్లడించారు.
మాజీ సీఎం వసుంధర రాజే నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పత్రాల లీకేజీ అంశాలపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోకపోతే తన ఆందోళనను ఉధృతం చేస్తానని సచిన్ పైలట్ సీఎం గెహ్లాట్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన విషయం తెలిసిందే. ఈ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలో పార్టీ పెద్దలు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. కాగా, 2018లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇద్దరు నేతల మధ్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తన వర్గం ఎమ్మెల్యేలతో సీఎం గెహ్లాట్‌పై సచిన్ తిరుగుబాటు కూడా చేశారు. అయితే అధిష్ఠానం జోక్యంతో సమస్యకు తాత్కాలికంగా తెరపడింది. అయితే పదవీ పంపకం విషయంలో గెహ్లాట్ ససేమిరా అనడంతో సచిన్ మరోసారి తన అసంతృప్తిని బయటపెట్టారు. ఏదిఏమైనా పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేలా విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.