పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి: ప్రతిపక్షాలు

నవతెలంగాణ – న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి తప్ప ప్రధాని కాదని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఈ నెల 18న ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారని, పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రారంభించేందుకు ఆయనను ఆహ్వానించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.  పార్లమెంట్ అధినేత అయిన రాష్ట్రపతి పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రారంభోత్సవం చేయాలి తప్ప ప్రభుత్వ అధినేత అయిన ప్రధాని కాదని విమర్శించాయి. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఈ మేరకు తన వాదనను ఆదివారం స్పష్టం చేశారు.
కాగా, పార్లమెంట్‌ కొత్త భవనాన్ని ప్రధాన మంత్రి మోడీ ఎందుకు ప్రారంభించాలి? అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఆయన కార్యనిర్వాహక అధిపతి అని శాసనసభకు కాదని అన్నారు. ఆయా అధికారాలకు సంబంధించిన విభజన స్పష్టంగా ఉందన్నారు. అలాగే పార్లమెంట్‌ కొత్త భవనాన్ని లోక్‌సభ స్పీకర్‌, రాజ్యస ఛైర్మన్‌ ప్రారంభించవచ్చుగా అని సూచించారు. కొత్త బిల్డింగ్‌ను ప్రజా ధనంతో నిర్మించారని అసదుద్దీన్‌ అన్నారు. అయితే తన స్నేహితులు వారి ప్రైవేట్ నిధులను ఇచ్చినట్లుగా ప్రధాని మోడీ ఎందుకు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ జయంతి రోజైన మే 28న పార్లమెంట్‌ కొత్త భవనం ప్రారంభించడాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్‌ రే తప్పుపట్టారు. దీనికి బదులుగా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ ఏటా అడుగు పెడుతున్న నవంబర్‌ 26న ప్రారంభిస్తే ప్రజాస్వామ్యానికి ఎంతో గౌరవంగా ఉంటుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Spread the love