కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం

నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సీనియర్‌ నేత సిద్ధరామయ్య శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌ ప్రమాణం చేశారు. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ వీరి చేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌, ప్రియాంక గాంధీకి శివకుమార్‌ స్వయంగా సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి వారిని వేదిక వద్దకు తీసుకొచ్చారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీతోపాటు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వారిలో తమిళనాడు సీఎం స్టాలిన్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఉన్నారు. వీరితోపాటు  సీనియర్‌ పొలిటీషియన్‌లు శరద్‌పవార్‌, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, డీ.రాజా, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌, పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సీనియర్‌ నేత, జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, సినీనటుడు కమల్‌హాసన్‌ తదితరులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Spread the love