నేటితో ముగియనున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర

నవతెలంగాణ – న్యూఢిల్లీ
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర ముగిసింది. సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించనున్న సభతో 4 వేల కిలోమీటర్లకుపైగా సాగిన యాత్రకు రాహుల్‌ ముగింపుపలుకనున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్రను గతేడాది సెప్టెంబర్‌ 7న కన్యాకుమారిలో ప్రారంభమైంది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లా మీదుగా 145 రోజులపాటు మొత్తం 4 వేల కిలోమీటర్లకుపైగా రాహుల్‌ నడిచారు. జోడోయాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని ఎస్‌కే స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు భావసారుప్యత కలిగిన 23 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్‌ ఆహ్వానించింది. వీటిలో 12 పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్‌ థాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, జేఎంఎం పార్టీల నేతలు సభకు హాజరవుతారని పేర్కొన్నాయి. టీఎంసీ‌, ఎస్పీ, టీడీపీ, జేడీయూలకు ఆహ్వానం అందినప్పటికీ ఈ సభకు దూరంగా ఉంటున్నాయి. తన యాత్రతో దేశం దృష్టిని ఆకర్షించిన రాహుల్‌.. ప్రతిపక్షాలను మాత్రం ఏకతాటిపైకి తీసుకురాలేకపోవడం గమనార్హం.

Spread the love