నవతెలంగాణ – ఢిల్లీ
సాధారణ పాస్ పోర్ట్ కోసం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దరఖాస్తును ఢిల్లీ కోర్టు శుక్రవారం పాక్షికంగా అనుమతించింది. మూడేళ్లపాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి) మంజూరు చేసింది. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ గాంధీ తన దౌత్య పాస్‌పోర్టును సరెండర్ చేశారు. ఆ తర్వాత సాధారణ పాస్ పోర్ట్ కోసం ఎన్‌ఓసి కోరారు. అయితే, నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ నిందితుడిగా ఉండటంతో ఆయనకు పాస్ పోర్ట్ మంజూరు చేయవద్దంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. రాహుల్ దరఖాస్తును వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రమించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వైభవ్ మెహతా వాదనలు విన్న తర్వాత ఆర్డర్‌ను రిజర్వ్ చేశారు. ఈ సమయంలో స్వామి దరఖాస్తును వ్యతిరేకించారు. రాహుల్ కు పాస్‌పోర్ట్‌ను ఒక సంవత్సరం పాటు మాత్రమే జారీ చేయాలని, ప్రతి సంవత్సరం పునరుద్ధరించాలని ఆదేశించారు. అదే సమయంలో కేసును ప్రత్యేకంగా భావించిన న్యాయమూర్తి పదేళ్ల కాలానికి పాస్ పోర్ట్ జారీ చేయకూడదన్నారు. అలా చేయడం తప్పుగా అవుతుందన్నారు.