యూత్ కాంగ్రెస్ సమావేశంలో రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని యూత్ కాంగ్రెస్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కత్రియా హోటల్‌లో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం మీరంతా కష్టపడాలి. పోరాడే వారికే భవిష్యత్ ఉంటుంది. రాజకీయ భవిష్యత్‌కు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక. నాయకుడిగా మారడానికి యూత్ కాంగ్రెస్ ఒక వేదిక. 1200 మంది విద్యార్థి, యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధాని. దేశాన్ని దోచుకోవడమే ఈ డబుల్ ఇంజన్ పని. వన్ నేషన్ వన్ పార్టీ అనేది బీజేపీ రహస్య ఎజెండా. బీజేపీ కుట్రలను ఛేదించి దేశంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలి.’’ అని రేవంత్‌ పిలుపునిచ్చారు. ఇక సెప్టెంబర్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు. కర్ణాటక తరహాలో ముందే మేనిఫెస్టో విడుదల చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే యూత్, రైతు, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించింది. త్వరలో మరిన్ని డిక్లరేషన్స్ ప్రకటించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మేనిఫెస్టో ఆలస్యం చేయడం వల్లే గతంలో ఇబ్బంది పడినట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధరతో పాటు బోనస్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, రైతుబందు సహాయం పెంపు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్రికల్ బైక్స్, నిరుద్యోగ భృతి మొదలగు అంశాలు పొందపరచనున్నారు.

Spread the love