సీఎం అభ్యర్థిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఉండగా.. ఈ సారైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో టీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు? ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి సీఎంగా అవకాశం వస్తుంది? అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంగా చేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారాన్ని చేపడితే దళితులు, గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంతమంది ఎన్నారైలు రేవంత్‌ను కోరారు. ఈ సందర్భంగా సీతక్కకు సీఎం పదవి గురించి వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.
రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం నేతలందరం కలిసి పనిచేస్తామని, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలను అమలు చేస్తామని రేవంత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎన్నారైలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కోసం తాను నిత్యం శ్రమిస్తూనే ఉంటానన్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతామని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో సీతక్కకు మంచి ఎమ్మెల్యేగా పేరుంది. అన్ని పార్టీల నేతలు ఆమెను గౌరవిస్తారు. బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలలోనూ ఆమెకు అభిమానులున్నారు. నిరంతరం ప్రజల్లో తిరుగుతూ, ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ సీతక్క మంచి రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డితో సీతక్కకు మంచి అనుబంధం ఉంది. తనకు సీతక్క సొంత చెల్లి లాంటిదని రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించగా.. రేవంత్‌ను తాను సొంత అన్నలా భావిస్తానని అనేకసార్లు సీతక్క చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కకు కీలక పదవి ఇస్తామని రేవంత్ గతంలో బాహటంగానే వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ స్థాయి కాంగ్రెస్‌లో సీతక్క కీలక పోస్టులో ఉన్నారు. ఇలాంటి తరుణంలో సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ఫోకస్ చేయడం వెనుక వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. సీతక్కకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు రేవంత్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ కూడా ఉంది.

Spread the love