రెజ్లర్లుతో హోంమంత్రి అమిత్‌షా భేటి..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: రెజ్లింగ్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లు శనివారం హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని ఆయన ఇంట్లో హోంమంత్రిని కలిసిన రెజ్లర్లు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. హోంమంత్రిని కలిసిన వారిలో రెజ్లర్లు భజరంగ్ పునియా సాక్షి మాలిక్ సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్ ఉన్నారు. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు. హోంమంత్రి అమిత్‌షా సానుకూలంగా స్పందించినట్లు రెజ్లర్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పినట్లు రెజ్లర్లు తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు ఇచ్చిన గడువు శనివారం ముగియడంతో హోంమంత్రి అమిత్‌షాతో సమావేశానికి రెజర్లు కోరినట్లు తెలుస్తోంది. కాగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌పై నిరసనను పెద్దగా పట్టించుకోలేదని ఆరోపించిన రెజ్లర్లు.. గత నెలలో గంగా నదిలో తమ పతకాలను నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించారు. అయితే రైతు సంఘం నేత నరేష్ టికాయత్ జోక్యంతో తాత్కాలికంగా విరమించుకున్నారు.

Spread the love