పెండ్లి మాటెత్తిందని నీళ్ల ట్యాంకర్ కిందకు తోసి..!

నవతెలంగాణ – హైదరాబాద్
భర్త చనిపోయి.. ఒంటరిగా ఉంటున్న ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ లోబరుచుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రియురాలు నిలదీయడంతో ఆమెను నీళ్ల ట్యాంకర్‌ కిందకు తోసేశాడు. ఆమె మృతిచెందగా తొలుత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండాకు చెందిన హరిజియా కుమార్తె భూక్యా ప్రమీల (23) ఇంటర్‌ పూర్తిచేసి కొన్నాళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. 2022 జనవరిలో ఆమెకు వివాహం కాగా ఏప్రిల్‌లో భర్త చనిపోయారు. ఆమె నగరంలోని బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో ముగ్గురు యువతులతో కలిసి ఉంటూ బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనిచేస్తున్నారు.
ఆమెకు తన సొంతూరు సమీపంలోని రోడ్‌బండ తండాకు చెందిన భూక్యా తిరుపతినాయక్‌ (25)తో చిన్ననాటి నుంచే పరిచయముంది. నగరంలోని కొండాపూర్‌లో ఉంటూ కారుడ్రైవర్‌గా పనిచేసే అతనితో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో తిరుపతికి ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరగడంతో విషయం తెలుసుకున్న ప్రియురాలు అతనికి ఫోన్లు చేస్తూ.. తనను పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. లేనట్లయితే తల్లిదండ్రులకు విషయం చెబుతానని స్పష్టంచేసింది. ఆదివారం ఉదయం కలవాలని ఆమె కోరగా.. తిరుపతి ద్విచక్రవాహనంపై మరో మిత్రుడితో వెళ్లి, బాచుపల్లి ప్రధాన రహదారి వద్ద కలిశాడు. పెండ్లి విషయంపై ఆమె నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం, పెనుగులాట చోటుచేసుకున్నాయి. తీవ్ర ఆవేశానికి లోనైన నిందితుడు ఆమెను అటుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్‌ కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ప్రమాదవశాత్తూ ఆమె ట్యాంకర్‌ కింద పడిపోయిందని నిందితుడు పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు. గట్టిగా ప్రశ్నించడంతో తానే ట్యాంకర్‌ కిందకు తోసేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.సుమన్‌కుమార్‌, ఎస్సై సంధ్య తెలిపారు.

Spread the love