డ్రైవర్‌కు ఫిట్స్‌.. అర్ధరాత్రి ట్రాఫిక్‌ రికవరీ వ్యాన్‌ బీభత్సం

నవతెలంగాణ – హైదరాబాద్: కాప్రాలో శనివారం అర్ధరాత్రి పోలీసు శాఖకు చెందిన ట్రాఫిక్‌ వాహనాల రికవరీ వ్యాన్‌ బీభత్సం సృష్టించింది. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించి విధులు ముగిశాక.. మల్కాజిగిరికి చెందిన టీఎస్‌08 ఈజెడ్‌2635 వాహనం అర్ధరాత్రి సాకేత్‌ నుంచి రాధికా చౌరస్తా వైపు వెళ్తోంది. ఓల్డ్‌ కాప్రా వద్దకు రాగానే వాహనం నడిపిస్తున్న డ్రైవర్‌ మోహన్‌కు ఫిట్స్‌ రావడంతో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న మిర్చీ బండిని ఢీకొట్టి విద్యుత్తు స్తంభానికి ఢీకొని ఆగిపోయింది. ఎవరికీ ఏమీ కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్‌ మోహన్‌ను స్థానికులు రక్షించారు. అతనికి సపర్యలు చేశారు. కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ బి.ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Spread the love