ఢిల్లీకి కర్నాటకం

– సీఎం పదవిపై వీడని సస్పెన్స్‌ రేసులో డీకే, సిద్ధరామయ్య
– హస్తినలోనే సిద్ధరామయ్య మకాం
– నేడు ఢిల్లీకి ట్రబుల్‌ షూటర్‌?
న్యూఢిల్లీ : కర్నాటక తదుపరి సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. సీఎం ఎంపిక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ సీఎల్పీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాన్ని చేసింది. దీంతో కర్నాటక రాజకీయం ఢిల్లీకి మారింది. సీఎం ఎంపిక విషయంలో రాష్ట్రానికి వచ్చి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న పార్టీ కేంద్ర పరిశీలకులు నివేదికతో ఢిల్లీ వెళ్లారు. ఆ నివేదికను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేసినట్టు తెలిసింది. అయితే సీఎం ఎంపికను ఖరారు చేయడానికి ఖర్గే.. యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలవనున్నారు. నేటి (మంగళవారం) సాయంత్రం వరకు సీఎం ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సిద్ధరామయ్య ప్రయత్నాలు ప్రస్తుతం సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్నాటక పీసీసీ చీఫ్‌ డి.కె. శివకుమార్‌లు ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌ అగ్రనాయకత్వాన్ని కలవడానికి సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నమే బెంగళూరులోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు సుబోధ్‌ కాంత్‌ సహారుతో ఆయన సమావేశమయ్యారు. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య తన వంతు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది : డి.కె శివకుమార్‌
సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న కర్నాటక కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డి.కె శివకుమార్‌ సైతం ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే, చివరి నిమిషయంలో తన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. అనారోగ్యం కారణంగానే ఢిల్లీకి వెళ్లటం లేదని ఆయన చెప్పారు. దీంతో ఆయన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకోవటం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఆ తర్వాత తాను నేడు (మంగళవారం) ఢిల్లీకి వెళ్లడానికి ప్రయత్నిస్తానని బెంగళూరులో ఆయన చెప్పారు. తామంతా ఒకటేననీ, అంతా కలిసే పని చేస్తామని డి.కె శివకుమార్‌ తెలిపారు. సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేసినందున అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డి.కె శివకుమార్‌ అన్నారు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించానని చెప్పారు. నా నాయకత్వంలో 135 స్థానాలు సాధించానని తెలిపారు. కాగా, సోమవారం రాత్రి ఢిల్లీలోని ఖర్గే నివాసానికి డి.కె శివకుమార్‌ సోదరుడు డి.కె సురేశ్‌ చేరుకున్నారు.
సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం
సీల్పీ సమావేశం ఆదివారం రాత్రి బెంగళూరులోని ఒక హౌటల్‌లో జరిగింది. సోమవారం ఉదయం 1.30 గంటల వరకు ఈ సమావేశం సాగింది. ఈ సమావేశానికి 135 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, పార్టీ నాయకులు జితేంద్ర సింగ్‌, దీపక్‌ బబరియా లు పరిశీలకులుగా హాజరయ్యారు. పార్టీ నాయకులు సిద్ధరామయ్య, డి.కె శివకుమార్‌, కె.సి వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఈ సమావేశానికి హాజరాయ్యరు. అయితే, డి.కె శివకుమార్‌ మద్దతుదారులు సమావేశం జరుగుతున్న హౌటల్‌ బయట ‘డి.కె శివకుమార్‌ సీఎంగా కావాలి’ అంటూ నినాదాలు చేశారు. సీఎం ప్రమాణస్వీకారానికి తేదీని ఈనెల 18గా డేట్‌ ఫిక్స్‌ చేసిన విషయం విదితమే. దీంతో నిర్దేశిత తేదీ దగ్గర పడుతున్న తరుణంలో సీఎం ఎంపిక ఇంకా ఖరారు కాకపోవటం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నది.

Spread the love