ఎన్‌పీఎస్‌ వద్దు

– పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి
– ఢిల్లీలో ఉద్యోగ సంఘాల మహార్యాలీ
న్యూఢిల్లీ: కొత్త పెన్షన్‌ విధానాన్ని (ఎన్‌పీఎస్‌) తొలగించి పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఢిల్లీలో ‘పెన్షన్‌ హక్కుల మహా ర్యాలీ’ని నిర్వహించారు. ఢిల్లీలోని రామ్‌లీల మైదానంలో గుమిగూడిన ఉద్యోగులు ఆందోళనను నిర్వహించారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని నినాదాలు వినిపించారు. రైల్వే యూనియన్‌ నాయకుల బృందం ప్రకటించినట్టుగా పాత పెన్షన్‌ స్కీమ్‌ పునరుద్ధరణ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) లేదా నేషనల్‌ జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ (ఎన్‌జేసీఏ) జాయింట్‌ ఫోరమ్‌ గొడుగు కింద ‘పెన్షన్‌ రైట్స్‌ మహారల్లీ’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్‌జేసీఏ జాతీయ కన్వీనర్‌, ఆలిండియా రైల్వే మెన్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా మాట్లాడుతూ.. జనవరి 1, 2004 తర్వాత ప్రభుత్వ సేవలను ప్రారంభించిన ఉద్యోగులలో గణనీయమైన భాగం కొత్త పెన్షన్‌ స్కీమ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ”ఈ ఉద్యోగులు తమ పదవీ విరమణ అనంతర అవకాశాల గురించి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ నుంచి తొలగించబడ్డారనీ, అసంకల్పితంగా కొత్త పెన్షన్‌ స్కీమ్‌ కింద ఉంచబడ్డారని భావిస్తున్నారు” అని తెలిపారు. ”దీని కారణంగా లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నది. అందుకే మేము పాత పెన్షన్‌ స్కీమ్‌ పునరుద్ధరణ కోసం జాయింట్‌ ఫోరమ్‌ను ఏర్పాటు చేసాము” అని మిశ్రా తెలిపారు.

Spread the love