అదరగొట్టిన ఎల్‌ఐసీ

– లాభాల్లో 1,299 శాతం వృద్ధి
– క్యూ4లో రూ.9,544 కోట్లుగా నమోదు
– సగానికి తగ్గిన మొండి బాకీలు
హైదరాబాద్‌: దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) బంఫర్‌ ఫలితాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 13 రెట్లు లేదా 1,299 శాతం వృద్థితో రూ.9,544 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.683 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ1లో సంస్థ నికర ప్రీమియం ఆదాయం యథాతథంగా రూ.98,363 కోట్లుగా చోటు చేసుకుందని రెగ్యూలేటరీ సంస్థలకు ఇచ్చిన సమాచారంలో ఎల్‌ఐసీ తెలిపింది. 2023 జూన్‌ ముగింపు నాటికి సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు 2.48 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే కాలానికి 5.84 శాతం జీఎన్‌పీఏ నమోదయ్యింది. కాగా.. నికర నిరర్థక ఆస్తులు శూన్యంగా ఉన్నాయి. 2023-24 ఏప్రిల్‌ – జూన్‌ కాలంలో పెట్టుబడులపై రూ.90,309 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.69,570 కోట్ల ఆదాయం నమోదయ్యింది. క్రితం క్యూ1లో 32,16,301 కొత్త వ్యక్తిగత పాలసీలను విక్రయించింది. 2022 ఇదే జూన్‌ త్రైమాసికంలో 36,81,764 పాలసీల అమ్మకాలు చేసింది.

Spread the love