ఏడెనిమిదివేలతో బతకలేం..జీతాలు పెంచాలనటం తప్పా?

– యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది పోరాటం న్యాయబద్ధమైనది
– పోరాటానికి అండగా ఉంటా..మండలిలో లేవనెత్తుతా..:
– తెలంగాణ యూనివర్సిటీస్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ధర్నాలో ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తాము ఏడెనిమిది వేల రూపాయల వేతనంతో బతకలేమనీ, జీతాలు పెంచాలని యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకుని వారి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వారి పోరాటానికి అండగా ఉంటాననీ, వారి సమస్యల పరిష్కారం కోసం రానున్న సమావేశాల్లో శాసనమండలిలో మాట్లాడుతానని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ. .యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్‌ సిబ్బందికి అరకొర వేతనాలే ఇస్తున్నారనీ, అందులోనూ ఏజెన్సీలు కోతపెడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమేమో తెలంగాణలో తలసరి ఆదాయం 3.17 లక్షలు అని గొప్పలకు పోతున్నదనీ, వీరి ఏడాది ఆదాయం చూస్తే 1.50 లక్షలు కూడా దాటడం లేదని చెప్పారు. అంత తలసరి ఆదాయం ఉండాలంటే కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అయినా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కిందిస్థాయి వారి జీవితాల్లో వెలుగులు ఉంటేనే దేశం వెలిగిపోతున్నట్టు అని చెప్పారు.ఇక్కడ అరకొర జీతాలతో కుటుంబాలు గడవక కార్మికులు, ఉద్యోగులు అవస్థలు పడుతుంటే ప్రధాని మోడీ వంటఖర్చులకు కోట్ల రూపాయలు అవసరమా? అని ప్రశ్నించారు. యూనివర్సిటీ నాన్‌టీచింగ్‌ సిబ్బంది అంతా సీఐటీయూ ఆధ్వర్యంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోరాటాల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె. వెంకటేష్‌ మాట్లాడుతూ.. టైమ్‌ స్కేల్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సమాన పనికి – సమాన వేతనం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కింద రూ.5 లక్షలు చెల్లింపు, ఇన్సూరెన్స్‌, ఈఎస్‌ఐ, పిఎఫ్‌, గుర్తింపు కార్డులు, మహిళా ఉద్యోగులకు ఆరు నెలలు వేతనంతో కూడిన సెలవులు, తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. లేనిపక్షంలో యూనివర్సిటీల వారీగా దీక్షలు, నిరసన కార్యక్రమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యక్షులు పద్మశ్రీ మాట్లాడుతూ.. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్న తరుణంలో పదివేల రూపాయల లోపు వేతనాలతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వర్సిటీల్లోనూ అదనపు గంటలు పనిచేయించడం దారుణమన్నారు. ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మెట్టు రవి, వి. నారాయణ మాట్లాడు తూ..యూనివర్సిటీల్లో నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. చేసే పని ఒక్కటే అయినప్పుడు ఒక్కో వర్సిటీలో వేర్వేరుగా వేతనా లు ఇవ్వటమేంటని ప్రశ్నించారు. ఆ యూనియన్‌ నాయకులు చిరంజీవి, రాంచం దర్‌, రవికుమార్‌, మహేందర్‌, ఆమీర్‌, ఎన్‌. వెంకటయ్య, గోవింద్‌, కొండా లక్ష్మణ్‌, రామారావు, రమణ, వివిధ యూనివర్సిటీల నాయకులు పాల్గొన్నారు.

Spread the love