ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తేయండి

డీజీపీకి కేసీఆర్‌ ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో పౌర హక్కుల నేత, ప్రొఫెసర్‌ కె.హరగోపాల్‌పై పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డీజీపీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. గతేడాది ఆగస్టు 19న తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో దాదాపు 152 మందిపై ఉపా చట్టం కింద కేసులను నమోదు చేశారు. తాడ్వాయి పోలీసు స్టేషన్‌ పరిధిలోని దట్టమైన అడవిలో సాయుధ మావోయిస్టులు సమావేశమై రాష్ట్రంలో కొందరు రాజకీయ ప్రముఖులను హత్య చేయడానికి, ప్రభుత్వాస్థులను విధ్వంసం చేయడాని కి కుట్ర పన్నారని పోలీసులు తాము నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు. మావోయిస్టుల రాష్ట్ర సమావేశం గురించి సమాచారమందుకున్న పోలీసులు ఆ ప్రాంతంపై దాడి చేయగా మావోయిస్టులు అప్పటికే పారి పోయినట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా లభించిన డైరీలో.. మావోయిస్టుల అగ్రనేత పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్నతో పాటు పలువురు మావోయిస్టులు, ప్రజాసంఘాల నాయకుల పేర్లు ఆ సమావేశంలో పాల్గొన్నట్టు ఉన్నాయి. ఆ డైరీలోనే ప్రొఫెసర్‌ హరగోపాల్‌ పేరు కూడా ఉన్నదని పేర్కొంటూ ఆయనపై కూడా ఉపా చట్టాన్ని ప్రయోగించారని ఆరోప ణలున్నాయి. కాగా, దాదాపు ఏడాది తర్వాత ఈ సమాచా రం పత్రికల ద్వారా వెలుగులోకి రావటంతో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై అక్రమంగా నమోదు చేసిన ఉపా చట్టాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి హరగోపాల్‌తోపాటు ఇతరులు మరికొందరిపై నమోదు చేసిన ఉపా చట్టాన్ని ఎత్తివేయాలంటూ పోలీసు ఉన్నతా ధికారులను ఆదేశించా రు. కాగా, తనపై ఉపా చట్టాన్ని ప్రయోగిస్తూ పోలీసులు అందుకు సంబంధించి మావోయి స్టుల సమావేశం జరిగిందంటూ కల్పితమైన కథను సృష్టించారని హరగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ ఖండించారు.
ఉపా చట్టం రద్దు చేయాలి పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టాలి
– ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌ డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘నా ఒక్కడిపై కేసులు ఎత్తేయడం కాదు. ‘ఉపా’ చట్టం కింద కేసులు నమోదైన 152 మందిపై కేసులు ఎత్తేయాలి. పోలీసులు పెట్టిన కేసుల్లో బలం లేదని దీనితో తేలిపోయింది. ‘ఉపా’ చట్టాన్ని రద్దు చేస్తామని అన్ని రాజకీయపార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి. ఆ మేరకు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాం. సాధారణ ఎన్నికల్లో ప్రజలు అడిగే ప్రశ్నలకు అధికారపార్టీ నేతలు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు కార్యాచరణ రూపొందిస్తాం’ అని నిర్బంధ వ్యతిరేక వేదిక – తెలంగాణ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీ హరగోపాల్‌ అన్నారు. శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయనతోపాటు
ఉపా చట్టం రద్దు చేయాలి
పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టాలి తెలంగాణ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, అరుణోదయ విమలక్క, పీఓడబ్ల్యూ సంధ్య, ప్రొఫెసర్‌ పద్మజాషా, వేదిక కో కన్వీనర్లు ఎమ్‌ రాఘవాచారి, కే రవిచందర్‌ సహా 29 ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తాడ్వాయి పోలీసులు పెట్టిన ‘ఉపా’ కేసులతో పాటు గతంలో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ తక్షణం ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ తనపై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు కాగానే సమాజంలో భిన్న వర్గాలకు చెందిన అధికారులు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయపార్టీల నేతలు, ప్రజలు వేగంగా స్పందించారనీ, ఇదే తరహా చొరవ ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేలా ఉండాలని ఆకాంక్షించారు. తాము పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇది కాదని స్పష్టం చేశారు. ‘ఉపా’ చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్‌పార్టీ అనీ, దాన్ని ఎత్తివేయాలని రాహూల్‌గాంధీ పాదయాత్ర సందర్భంగా చెప్తే, సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. గడచిన 9 ఏండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని విచ్చలవిడిగా వాడుతూ, ప్రశ్నించే గొంతుల్ని అణచివేసేందుకు ఉపయోగించుకున్నదనీ, రాష్ట్రంలో కూడా ఇందుకు భిన్నమైన పాలన ఏమీ లేదన్నారు. దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం, పౌరహక్కులు బ్రతికే ఉన్నాయా అనే సందేహం కలుగుతున్నదని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమపార్టీగా ఏమాత్రం లేదనీ, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేంద్రంలో నియంతృత్వం, ఫాసిజం రాజ్యమేలుతున్నాయని విమర్శిస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్రంలోనూ అదే తరహా పాలన ఉన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోల్లో ‘ఉపా’ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని రాజకీయపార్టీలు ప్రజలకు హామీ ఇవ్వాలని స్పష్టంచేశారు.
స్వాగతిస్తున్నాం
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై పెట్టిన ఉపా కేసును ఎత్తేయాలంటూ సీఎం కేసీఆర్‌ డీజీపీని ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్ల గొంతులను నొక్కడానికి ప్రభుత్వాలు ఉపా చట్టాన్ని ప్రయోగిస్తున్నాయని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ఈ చట్టాన్ని ఎత్తేయాలంటూ సీపీఐ(ఎం)తోపాటు, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాయని పేర్కొన్నారు. హరగోపాల్‌తోపాటు ఇతరులపై పెట్టిన కేసులను కూడా ఎత్తేయాలని కోరారు. భవిష్యత్‌లో కూడా రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయొద్దని సూచించారు. ప్రజాస్వామ్య హక్కులను దుర్వినియోగపరుస్తున్న ఈ చట్టాన్ని ఉపసంహరించుకునేందుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవ చూపాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
సంతోషదాయకం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పద్మజాషాతో సహా 152 మంది పెట్టిన కేసులను ఎత్తేయడం సంతోషదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలను ప్రకటించారు. ఉపా చట్టాన్ని దేశవ్యాప్తంగా ఎత్తేయడానికి ప్రజాతంత్రవాదులు ముందుకు రావాలని, కేసీఆర్‌ చొరవ చూపాలని కోరారు. 1987లో తనపైనా టాడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతుకలపైన ఉపాలాంటి కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు.
స్వాగతిస్తున్నాం : నారాయణ
ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై పెట్టిన ఉపా కేసును నమోదు చేయడాన్ని సీపీఐతోపాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వ్యతిరేకించడంతో సీఎం కేసీఆర్‌ ఆ కేసును వెనక్కి తీసుకోవాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలిపారు. హరగోపాల్‌ తెలంగాణ ఉద్యమంతోపాటు అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని యావత్తు దేశానికి తెలిసేలా ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు.

Spread the love