రూ.88,000 కోట్లు గల్లంతు

రూ.500 నోట్లపై పొంతన లేని లెక్కలు
రూ.88,000 కోట్లు గల్లంతు

హైదరాబాద్‌ : భారత ఆర్థిక వ్యవస్థ నుంచి ఏకంగా రూ.88,032 కోట్లు గల్లంతయ్యాయి. అవన్నీ ప్రింట్‌ చేసిన రూ.500 నోట్లు కావడం గమనార్హం. సామాజిక కార్యకర్త మనోరంజన్‌ రారు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ విషయం వెల్లడయ్యింది. ముద్రించిన నోట్లు
ఆర్‌బీఐకి చేరకపోవడం విశేషం. దేశంలో బెంగళూరులోని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ నోట్‌ ముద్రన్‌ (పీ) లిమిటెడ్‌, నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌, మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఉన్న బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌లలో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 2016లో పాతనోట్లను రద్దు చేసి కొత్త రూ.500 నోట్లను ప్రవేశపెట్టిన సమయంలో దేశంలోని మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌ల నుంచి 8,810.65 మిలియన్ల రూ.500 నోట్లను ముద్రించారు. కానీ, అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్‌బీఐకి చేరాయి. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదు. వీటి విలువ రూ.88,032.50 కోట్లుగా ఉందని మనోరంజన్‌ తెలిపారు. ఆర్‌టీిఐ సమాచారం ప్రకారం.. 2016-17 మధ్య కాలంలో 1,662 మిలియన్ల రూ.500ల నోట్లను ముద్రించినట్టు నాశిక్‌ మింట్‌ వెల్లడించింది. ఇదే సమయంలో బెంగళూరులోని ప్రెస్‌లో 5,195.65 మిలియన్లు, దేవస్‌లో 1,953 మిలియన్ల నోట్లను ముద్రించారు. మొత్తంగా 8,810.65 మిలియన్ల నోట్లను ముద్రించగా.. ఇందులో 7260 మిలియన్ల నోట్లే ఆర్‌బిఐక చేరాయి. నోట్ల ముద్రణ, ఆర్‌బీఐకి చేరిన నోట్ల వ్యత్యాసంపై విచారణ చేపట్టాలని ఆర్‌టిఐ కార్యకర్త మనోరంజన్‌ సెంట్రల్‌ ఎకనామిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లకు లేఖ రాశారు.

Spread the love