రాజకీయ లబ్ది కోసమే మణిపూర్‌ మంటలు

– మత ఘర్షణలతో ఓట్లు పొందేందుకే యూసీసీ బిల్లు
– బీజేపీ కుట్రలను ఐక్యంగా తిప్పికొట్టాలి
– మోడీ సర్కార్‌ను గద్దెదించేందుకు అన్ని శక్తులూ ఏకంకావాలి
– సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాల్సిందే
– అల్లర్లను అరికట్టాలి- ప్రజల ప్రాణాలను కాపాడాలి
– శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలిొ వామపక్షాల భారీ ప్రదర్శన, అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాజకీయ స్వార్ధం, లబ్ది పొందడం కోసమే మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నాయని సీపీఐ, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పైకి రెండు తెగల మధ్య ఘర్షణగా కనిపిస్తున్నా దానివెనుక బీజేపీ కుట్ర దాగి ఉందన్నారు. దాన్ని ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. మణిపూర్‌ సీఎం బీరెన్‌సింగ్‌ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అక్కడ అల్లర్లను అరికట్టాలనీ, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం వరకు భారీ ప్రదర్శనను నిర్వహించారు. ‘మణిపూర్‌ సీఎం రాజీనామా చేయాలి, ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, బీజేపీ కో హఠావో… దేశ్‌కో బచావో, మణిపూర్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ గద్దెదిగాలి, మహిళలను నగంగా ఊరేగించిన వారిని ఉరితీయాలి, మత రాజకీయాలు, విద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడతాం, హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి’అంటూ నాయకులు, కార్యకర్తలు ఫ్లకార్డులు ప్రదర్శించి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
మణిపూర్‌ హింస వెనుక కేంద్రం పెద్దలు : తమ్మినేని
మణిపూర్‌ హింస వెనుక కేంద్రం పెద్దలున్నారనీ, వారి ఆశీర్వాదంతోనే సీఎం బీరెన్‌సింగ్‌ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. అక్కడ తలలు నరకడం, సామూహిక లైంగికదాడులకు పాల్పడడం, దోపిడీలు, భయంకరమైన హింసాకాండ కొనసాగుతున్నదని అన్నారు. కుకీ, మైతీ అనే తెగల మధ్య జరుగుతున్న ఘర్షణగా చెప్తున్నా అది వాస్తవం కాదన్నారు. రెండు, మూడు నెలల నుంచి హింసాకాండ కొనసాగుతున్నా కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. బీజేపీ ఎంపీ స్థానాలు రెండు నుంచి 300కు పెరిగాయన్నారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగడం లేదన్నారు. మత ఘర్షణలను సృష్టించి 2024లో మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును ముందుకు తెస్తున్నదని అన్నారు. మహిళలు, పురుషులు సమానంగా ఉండే చట్టాలను తేవాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. రాజద్రోహం, ఉపా వంటి చట్టాలను ప్రయోగిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ యూసీసీ పేరుతో మోసం చేస్తున్నారని విమర్శించారు. ఆ బిల్లు తెస్తే హిందూ, ముస్లింల మధ్య ఘర్షణ వస్తుందనీ, దానివల్ల ఎన్నికల్లో బీజేపీ ఓట్లు పొందొచ్చన్న కుట్ర ఉందనీ, ఆ కుట్రబుద్ధిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించడం కోసమే 26 ప్రతిపక్ష పార్టీలు ఐక్యమయ్యాయని వివరించారు. రాష్ట్రంలోనూ అలాంటి ఐక్యత కోసం కృషి చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్‌ యూసీసీపై స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. వైసీపీ, టీడీపీ ఖండించడం సంతోషకరమని చెప్పారు.
సంపదను అదానీకి కట్టబెట్టే కుట్ర : నారాయణ
మణిపూర్‌లో సంపదను అదానీకి కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదనీ, 54 వేల ఎకరాల భూమిని అప్పగించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. భూగర్భ సంపదను కార్పొరేట్‌ శక్తులకు అప్పగిస్తున్నారని చెప్పారు. మణిపూర్‌ చైన్‌ ద్వారా ఆయుధాలతో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతున్నారని అన్నారు. కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వారి వద్ద ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడ అల్లర్లను అరికట్టాలనీ, శాంతిని నెలకొల్పాలంటూ ఇప్పటి వరకు ప్రధాని మోడీ కోరలేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు మహిళలను నగంగా ఊరేగించిన వీడియోలను ఉద్దేశపూర్వకంగా విడుదల చేశారని అన్నారు. విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడతాయనీ, సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించినందున చర్చకు అవకాశం లేదంటూ కేంద్రం తప్పించుకుంటున్నదని వివరించారు. ప్రజాసమస్యలు చర్చకు రాకుండా కుట్ర చేసిందన్నారు. మోడీ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండేందుకు వీల్లేదని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అధికారాన్ని శాశ్వతంగా నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నదని చెప్పారు. మణిపూర్‌లో మహిళల పట్ల వ్యవహరించిన తీరు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమనీ, వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాలను తేవాల్సిన అవసరముందని సూచించారు. లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిలో 80, 90 శాతం బీజేపీకి చెందిన వారే ఉన్నారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడే నాడు గుజరాత్‌లో గోద్రా ఘటన, నేడు మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్నదని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ భేటీ పడావో భేటీ బచావో అంటూ నినదించిన ప్రధాని మోడీ వారి విషయంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటే మహిళలకు రక్షణ లేకుండా చేయడమేనా?అని అడిగారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ, సీపీఐ(ఎం) హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం దశరథ్‌ సమన్వయకర్తలు వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డిజి నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌ ఛాయాదేవితోపాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love