ముందుగానే హామీ తీసుకోండి

– వెనక్కి ఇవ్వబోమని స్పష్టంగా చెప్పమనండి
– ‘అవార్డ్‌ వాపసీ’పై పార్లమెంటరీ కమిటీ సూచన
న్యూఢిల్లీ : 2015లో ఎదురైన ‘అవార్డ్‌ వాపసీ’ చేదు అనుభవం భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ కొన్ని సూచనలు చేసింది. రాజకీయ కారణాలతో నిరసన తెలుపుతూ ఏ దశలోనూ తమకు ఇచ్చిన అవార్డులను వాపసు ఇవ్వబోమని అవార్డు గ్రహీతల నుంచి ముందుగానే లిఖితపూర్వక హామీ పొందాలని సిఫార్సు చేసింది. కర్నాటకకు చెందిన ప్రముఖ రచయిత ఎంఎం కాల్‌బర్గీ దారుణ హత్యను నిరసిస్తూ తమకు ఇచ్చిన అవార్డులను వాపసు చేస్తున్నామని ఆ సందర్భం లో 39 మంది రచయితలు సాహిత్య అకాడమీకి తెలియజేసిన విషయం విదితమే. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీని (రవాణా, టూరిజం, సంస్కృతి) ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సోమవారం పార్లమెంట్‌ ఉభయసభలకు తన నివేదికను అందజేసింది. ‘అవార్డులను వాపసు చేయడం సరైన చర్య కాదు. ఇతర అవార్డు గ్రహీతల విజయాలను ఇది తక్కువ చేసి చూపుతుంది. అంతేకాక అవార్డుల పేరు ప్రతిష్టలపై కూడా ప్రభావం పడుతుంది. రాజకీయ అంశాలకు, సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధం లేదు. అకాడమీ ఓ స్వతంత్ర సంస్థ. అవార్డు ఎప్పుడు ఇచ్చినా దానిని అందుకునే వారి అనుమతి తప్పనిసరి. దీనివల్ల రాజకీయ కారణాలతో దానిని వాపసు చేయడం జరగదు. అలా వెనక్కి ఇవ్వడం దేశానికి అవమానకరం. వాపసు ఇవ్వబోమని హామీ పొంద కుండా అవార్డులు ఇవ్వకూడదు. ఒకవేళ అవార్డును వెనక్కి ఇస్తే భవిష్యత్తులో వారి పేరును అవార్డు కోసం పరిశీలించకూడదు’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కమిటీ సూచించింది. ఈ కమిటీలో 10 మంది రాజ్యసభ, 31 మంది లోక్‌సభ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు.
కాగా అలాంటి హామీ ఏదీ ముందుగా పొందనవసరం లేదని ఒక సభ్యుడు అభిప్రాయపడ్డారు. మనది ప్రజాస్వామ్య దేశమని, రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించిందని, అవార్డును వాపసు చేయడం కేవలం నిరసనలో భాగమేనని ఆయన తెలిపారు. మరో సభ్యుడు కూడా ఆయనతో ఏకీభవించారు.

Spread the love