భోజ్‌పురి గాయనిపై కేసు

– ‘మూత్రవిసర్జన’పై పోస్ట్‌ పెట్టారని ఆరోపణ
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘మూత్ర విసర్జన’ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ పెట్టారని ఆరోపిస్తూ భోజ్‌పురి గాయని నేహా రాథోడ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ మధ్యప్రదేశ్‌ ఎస్సీ విభాగం మీడియా ఇన్‌ఛార్జ్‌ సూరజ్‌ ఖారే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 153 ఏ (వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంచడం) కింద కేసు నమోదు చేశామని హబీబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ మనీష్‌ రాజ్‌ భరోడియా చెప్పారు. అర్థనగంగా ఉన్న ఓ వ్యక్తి మరొకరిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు రాథోడ్‌ సామాజిక మాధ్యమాలలో ఓ కారికేచర్‌ను పోస్ట్‌ చేశారు. మూత్ర విసర్జన చేస్తున్నట్లు చూపిన వ్యక్తి తెల్ల చొక్కా, నల్ల టోపీ ధరించాడు. అతని ఖాకీ నిక్కరు నేలపై పడి ఉంది. కారికేచర్‌ కింద ‘మధ్యప్రదేశ్‌లో ఏం జరుగుతోంది?’ అని రాశారు.
తనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తర్వాత రాథోడ్‌ ట్విటర్‌లో బీజేపీపై మండిపడ్డారు. మూత్ర విసర్జన ఘటనను విమర్శించినందుకు తనపై కేసు పెట్టారని అంటూ గిరిజనులపై వారికి ఎంత ప్రేమో అని ఎత్తిపొడిచారు. నివాస గృహాన్ని బలవంతంగా ఖాళీ చేయించిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో తల్లీకూతురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై యోగి ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఫిబ్రవరిలో ఆమెకు నోటీసు జారీ చేశారు.
మరో ఇద్దరి పైనా…
ఇదిలావుండగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త సురేంద్ర సింగ్‌ అలావా ఇచ్చిన ఫిర్యాదు మేరకు గిరిజన నేత లోకేష్‌ ముజల్దా, పాత్రికేయుడు అభిషేక్‌పై ఇండోర్‌ పోలీసులు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. మూత్ర విసర్జన ఘటన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కార్టూన్లు షేర్‌ చేసినందుకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ యూనిఫారం ధరించిన ఓ వ్యక్తిని కార్టూన్‌లో అభ్యంతర కరమైన రీతిలో చిత్రించారని, దానిని వీరిద్దరూ ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో షేర్‌ చేశారని వివరించారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత అభిషేక్‌ ట్విటర్‌లో పోస్ట్‌ పెడుతూ తాను షేర్‌ చేసిన కార్టూన్‌ కొందరి మనోభావాలను దెబ్బతీసినందున దానిని తొలగించి, క్షమాపణలు చెప్పానని అన్నారు.

Spread the love