బీజేపీకి వ్యతిరేక గాలి

– దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌
న్యూఢిల్లీ : ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్‌ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక గాలి వీస్తున్నదని అన్నారు. కర్నాటకలోని ఇటీవలి అసెంబ్లీ ఫలితాలను పరిగణలోకి తీసుకొని దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజల ఆలోచన ఇలాగే కొనసాగితే రానున్న ఎన్నికల్లో దేశంలో మార్పు వస్తుందని అన్నారు. ఎన్నికల్లో ఈ విషయాన్ని ఏ జ్యోతిష్యుడు చెప్పాల్సిన అవసరం లేదు అని పవార్‌ మీడియా సమావేశంలో చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శరద్‌పవార్‌ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
మహారాష్ట్రలో చిన్న సంఘటనలకు కూడా మతం రంగు పులుముతున్నారనీ, ఇది మంచి సంకేతం కాదని ఆయన తెలిపారు. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం గురించి శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. మిత్రపక్షాలకు చెందిన చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. అయితే, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే దేశాన్ని పాలించే వారు (అధికార బీజేపీ) లోక్‌సభ ఎన్నికలతోనే అసెంబ్లీ ఎలక్షన్స్‌కు వెళ్తారని తాను అనుకోవటం లేదని చెప్పారు. వారు కేవలం లోక్‌సభ ఎన్నికల మీదనే దృష్టి పెడతారని తెలిపారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత పాలకులకు ఉన్నదనీ, దీనిపై అధికార పార్టీలకు చెందినవారు రోడ్ల మీదకు వచ్చి రెండు మతాల మధ్య చిచ్చు పెట్టటం మంచి పరిణామం కాదని అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు వీటిని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఎవరో ఔరంగబాద్‌లో ఒక పోస్టర్‌ చూపిస్తే పూణేలో హింస ఎందుకు అవసరం? అని శరద్‌పవార్‌ ప్రశ్నించారు. మహారాష్ట్రలో వ్యవసాయ సంబంధ సమస్యలపై ఎన్సీపీ చీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృక్పథం సానుకూలంగా లేదని అన్నారు. కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిదారులకు ప్రయోజనకరంగా లేదని పవార్‌ తెలిపారు.

Spread the love