తీస్తా సెతల్వాద్‌పై ఆరోపణలను ఉపసంహరించుకోవాలి

– ఉద్యమకారులపై వేధింపులకు ముగింపు పలకాలి: పెన్‌ ఇంటర్నేషనల్‌ ఆందోళన
న్యూఢిల్లీ : హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌పై న్యాయవ్యవస్థ, మోడీ సర్కారు చర్యలపై గ్లోబల్‌ ఫ్రీ స్పీచ్‌ వాచ్‌డాగ్‌ పెన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆమెను జైలులో ఉంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో స్వేచ్ఛా వ్యక్తీకరణ, భారత ప్రభుత్వంపై శాంతియుత విమర్శల కోసం శుత్రువు వాతావరణ తీరును తప్పుబట్టింది. ”సెతల్వాద్‌పై ఉన్న అన్ని ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. వారి శాంతియుత వ్యక్తీకరణ కోసం రచయితలు, జర్నలిస్టులు, ఉద్యమకారులపై వారి వేధింపులకు ముగింపు పలకాలని సంస్థ భారత అధికారులను కోరుతున్నది” అని పెన్‌ ఇంటర్నేషనల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2002 అల్లర్లకు సంబంధించి అప్పటి గుజరాత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయికి చెందిన కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు గుజరాత్‌ హైకోర్టు గత వారం బెయిల్‌ నిరాకరించిన విషయం విదితమే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుప్రీంకోర్టు ఆమె మధ్యంతర బెయిల్‌ను పొడిగించడంతో ఆమెకు కాస్త ఊరట లభించింది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ఈనెల 19న జరగనున్నది.

Spread the love