మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

– తమిళనాడులో శాంతికే ముప్పుగా పరిణమించారు : గవర్నరు చేష్టలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్టాలిన్‌ లేఖ
చెన్నై : వివాదాస్పదుడైన తమిళనాడు గవర్నరు ఆర్‌ఎన్‌ రవి చేష్టలతో విసుగెత్తిపోయిన ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ ఆయనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేస్తూ ఆదివారం ఒక లేఖ రాశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తి, తమిళనాడులో శాంతికి ముప్పుగా పరిణమించిన వ్యక్తి, తమిళనాడు రాష్ట్రానికి, తమిళ ప్రజలకు, తమిళ సంస్కృతికి శత్రు వుగా ఉన్న వ్యక్తి గవర్నరు పదవికి ఎంతమాత్రమూ తగరని స్టాలిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాతో ఢిల్లీలో తమిళనాడు గవర్నర్‌ సమావేశమైన తరుణంలో స్టాలిన్‌ ఈ లేఖాస్త్రాన్ని సంధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 159 ప్రకారం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, తమిళనాడు ప్రజల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసిన గవర్నరు, ఆ ప్రమాణాన్ని తుంగలో తొక్కి కేంద్రానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తూ, మన ఫెడరల్‌ స్పూర్తిని,ప్రజాస్వామ్య మౌలిక విలువలను మంటగలుపుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కూలదోద్దామా అని గవర్నరు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులకు ఓకే చెప్పకుండా నెలల తరబడి గవర్నరు తొక్కిపెడుతున్నారని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరికి భిన్నమైన రాజకీయ, సైద్ధాంతిక వైఖరి తీసుకుంటున్నారని, నిందితులకు మద్దతిస్తున్నారని పోలీసు దర్యాప్తుల్లో జోక్యం చేసుకుంటున్నారని స్టాలిన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రి సెంథిల్‌ బాలాజీని ఏకపక్షంగా డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులివ్వడం, ఆతరువాత వాటిని నిలుపుచేస్తున్నట్టు ప్రకటించడం ఇవన్నీ గవర్నరు పిల్ల చేష్టలను తెలియజేస్తున్నాయని అన్నారు. ఆరు మాసాల క్రితం స్టాలిన్‌ ఇదే అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

Spread the love