ఏఐకేఎస్‌ ఆందోళన విజయవంతం

– తమిళనాడు మామిడి రైతులకు ఊరట
చెన్నయ్ : తమిళనాడులో మామిడి రైతుల కోసం అఖిలభారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) చేపట్టిన ఆందోళన విజయవంతం అయింది. దిండిగల్‌ జిల్లాలో ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన ధర చెల్లించి రోజుకు 400 టన్నుల మామిడి కాయలను కొనుగోలు చేసేందుకు అధికారులు అంగీకరిం చారు. మామిడి సీజన్‌ ముగుస్తుండడంతో టన్ను మామిడి కాయల ధర రూ.7000 నుండి రూ.14,000 మాత్రమే పలుకుతోంది. గత సంవత్సరం ఇదే కాలంలో టన్ను మామిడి కాయలకు రూ.30,000 నుండి రూ. 70,000 వరకూ ధర లభించింది. ధరలను తగ్గించేందుకు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడడంతో ప్రస్తుతం టన్నుకు రూ.6,500 మాత్రమే లభిస్తోంది.
దీంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని 15,800 హెక్టార్లలో మామిడిని పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కనీసం నాలుగు ప్రాంతాలలో కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర చెల్లించాలని ఏఐకేఎస్‌, రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం ఏఐకేఎస్‌ నేతృత్వంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సీజన్‌ ముగిసే వరకూ రోజుకు 400 టన్నుల మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ అంగీకరించిందని ఏఐకేఎస్‌ జిల్లా కార్యదర్శి రామస్వామి తెలిపారు. రైతులకు న్యాయమైన ధర లభించాలంటే ప్రభుత్వమే వ్యవసాయ సహకార సంఘాల ద్వారా మామిడి కాయలు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love